పరమశివుని దగ్గరికి వచ్చే సరికి ఆ మూర్తి చాలా ఆశ్చర్యకరం. ఆయనది చాలా చిత్రాత్రిచిత్రమైనటువంటి స్వరూపం. ఒకచోట కరచరణాదులతో కనపడతాడు. ఒకచోట అర్థనారీశ్వర స్వరూపంతో కనపడతాడు. ఒకచోట నటరాజుగా కనపడతాడు. ఒకచోట దక్షిణామూర్తిగా కనపడతాడు. అసలు పరమశివుడు పట్టినన్ని ఆయుధములు బహుశః ఏ మూర్తీ ఎప్పుడూ ఎక్కడా పట్టి ఉండడు. ఎన్ని ముద్రలు ఉన్నాయి అన్ని ముద్రలూ పరమశివుడు పడతాడు. ఎన్ని ఆభరణాలో, ఎన్ని రకాలైన ఆయుధాలో. ఒక్కొక్క స్వరూపంలో రకరకాలైన ఆయుధాలు పట్టుకుంటాడు. అన్నింటికన్నా చిత్రాతిచిత్రమైన విషయం ఏమిటంటే ఆయన రూపము ఉన్నవాడా? రూపము లేనివాడా? చెప్పడం కూడా కష్టం. అరూపరూపి అన్నారు చంద్రశేఖర పరమాచార్యుల వారు. రూపం లేదు అందాం అంటే లింగస్వరూపం కనపడుతోంది. అది మూర్తి అనడానికి దానికి కరచరణాదులు లేవు. పోనీ లింగ స్వరూపం ఉన్నవాడే సాకారంగా కనపడితే పార్వతీ పరమేశ్వరులుగా కరచరణాదులతో కనపడతాడు.
శివా! ఎక్కడైనా చూడరాని దానిని చూస్తే అబ్బో ఇలాంటిది కనపడింది అని శివ శివా అంటాం. అసలు నీరూపం చూస్తే ఎన్నిసార్లు శివా అనాలి? ఎవరిని పిలవాలి?
“తునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా
ననయము భస్మధారణము యద్రి నివాసము మేలు విల్లు
గా నడుము దంతి చర్మమును హస్తములందు కపాల శూలముల్
పడివడి దాల్తు శంకరు కృపావరు రూపముననాశ్రయించెదన్!!” అంటారు.
ఆయన ఉండేది చూస్తే రుద్రభూమిలో. వేసుకొనేది చూస్తే బ్రహ్మాండమైన పుర్రెల మాల. పోనీ చేతిలో పట్టుకునేది చూస్తె బ్రహ్మకపాలం. త్రాగేది చూస్తే హాలాహలం. ఒంటి మీద చూస్తే పాములు. కట్టుకున్నది చూస్తే రక్తం ఓడుతున్న ఏనుగు తోలు. పైన కప్పుకున్నది చూస్తే పులితోలు. ఇన్ని అవలక్షణాలతో కనపడిన వాడిలా కనపడుతూ ఇంత అమంగళుడిలా ఉంటాడు ఆ శంకరుడి దగ్గరికి ఎవరు వెళ్ళి ఆయన పాదాలు పట్టుకోగలరు? బస్సు అని ఒక ప్రక్క పాములా? ఒక ప్రక్క రక్తం ఓడుతున్న ఏనుగు చర్మమా? ఓ ప్రక్క మూడుకన్నులా? ఓ ప్రక్క చంద్రవంకా? పెద్ద జటాజూటమా? ఏం అందం ఉందండీ శంకరునికి? అదే మా స్వామి శ్రీమహావిష్ణువో
మేఘశ్యామం పీత కౌశేయవాసం శ్రీవత్సాఙ్కం కౌస్తుభోద్భాసితాఙ్గమ్.
పుణ్యోపేతం పుణ్డరీకాయతాక్షం విష్ణుం వన్దే సర్వలోకైకనాథమ్!!
అంత అందగాడు కదా! శివుడు ఎందుకు ఇలా ఉంటాడు? అనుకుందాం అంటే ఆ శంకరుడి అందం చూసి ముచ్చట పడిపోయి పూజచేసిన వాడు మొట్టమొదట శ్రీమహావిష్ణువు. ఎంత పూజ చేశాడు అంటే సామాన్యమైన పూజ కాదు కాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి దెప్పిపొడిచాడు.
వన్నేఏనుగుతోలు దుప్పటము, బువ్వా, కాలకూటంబు చే
గిన్నే బ్రహ్మకపాల, ముగ్రమగు భోగే కంఠహారంబు, మే
ల్నిన్నీలాగున నుంటయుం దెలిసియు న్నీపాదపద్మంబు చే
ర్చె నారాయణు డెట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వరా !
ఏమిటోయ్ స్వామీ? నువ్వు చూస్తే ఏనుగుతోలు కప్పుకొని, బ్రహ్మకపాలం పట్టుకొని హాలాహలం తాగుతూ ఇలా ఉన్నట్లు ఉంటావు. అంత అందగాడుగా కనపడే శ్రీమహావిష్ణువు చూస్తే నీ పాదాల దగ్గర కూర్చొని ఇంత పూజ చేసి నీలో సగభాగాన్ని పొందాడు. పార్వతీదేవిలో కన్నా ముందు పరమశివుడిలో ఉన్నటువంటి సగభాగాన్ని పొందినటువంటి వాడు శ్రీమహావిష్ణువు. అందుకనే హరిహరమూర్తి అని ఒక మూర్తి.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment