గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 22 June 2014

ముక్తానాం పరమాగతిః --- బంధరహితులకు పరమమైన గతి. అంటే

ముక్తానాం పరమాగతిః 
బంధరహితులకు పరమమైన గతి. అంటే - బంధరహితులు తుదకు చేరు చోటు. దేహేంద్రియ మనో బుద్ధులతో ఆవృతమైన జీవభావం వాటిని వదిలితే పొందే స్థితి ’పరమాత్మస్థితి’. ఆ వదలడాన్నే ’ముక్త’ అంటారు. అలా వదిలిన వారు ముక్తులు. ఆ స్థితిని చేరితే తిరిగి బంధనముండదు. ’యద్గత్వాననివర్తన్తే తద్ధామ పరమం మమ’ దేనిని చేరితే పునరావృత్తి ఉండదో అదే పరమగతి - పరంధామం. ముక్తులు చేరుకొనే ఆ పరంధామము నారాయణ బ్రహ్మము.
ముక్తులైన యోగీశ్వరులు (సంసార బంధనమునుండి విడివడి, పరమాత్మతో కలయిక కలిగినవారు) ఆయననే ఆశ్రయించుకొని ఉంటారు. వారికి మరి రెండవ విషయం లేదు. బ్రహ్మముతో తాదాత్మ్యం చెంది ఉంటారు. ముక్త పురుషులు జ్ఞానులు. వారు పూర్ణంగా పరమాత్మను తెలిసినవారు. అందుకే వారు ఏ కారణమూ, ప్రయోజనమూ లేక ఆయననే ఆశ్రయించి ఉంటారు.
ఆత్మారామాశ్చమానయో నిర్గ్రంథా అప్యురుక్రమే!
కుర్వంత్యహైతుకీం భక్తిమ్ ఇత్థం భూత గుణోహరిః!! భాగవతం !!
"ఆత్మారాములు (తమయందు తాము ఆనందించువారు), మననశీలురు, కర్మబంధములు విడివడినవారు నారాయణుని యందు ఏ నెపమూలేని (అహైతుకీ) భక్తిని కలిగి ఉంటారు. - పరమాత్మ అయిన నారాయణుని గురించి తెలిసినవారు కనుక."
ధీరులు నిరపేక్షులు ఆ
త్మారాములునైన మునులు హరిభజనము, ని
ష్కారణమున జేతురు ఆ
నారాయణుడట్టివాడు నవ్యచరిత్రా!! (పోతన - భాగవతం)
అంతేకాక -
ముక్తసంగులైన మునులు దిదృక్షుు
సర్వభూతహితులు సాధుచిత్తులు
అదృశవ్రతాఢ్యులై కొల్తురెవ్వని
దివ్యపదము, వాడు దిక్కు నాకు
- అని గజేంద్రుని మొర. ముక్తులకే దిక్కైనవాడు, ఇంక మిగిలిన వారికి దిక్కు - అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ముక్తులు పొందే తుది గమ్యం - "తద్విష్ణోః పరమపదం సదాపశ్యంతి సూరయః" - శ్రుతి.
ఆ విష్ణుడే పరమపదం - అదే పరమాగతి. దానిని ముక్తులు అందుకుంటున్నారు. వారే సూరులు.
’మాముపేత్యతు కౌన్తేయ! పునర్జన్మ నవిద్యతే’ - నన్నుపొందిన ఎడల పునర్జన్మ సంభవించదని భగవానుని వచనం.
తదావిద్వాన్ పుణ్య పాపద్విముక్తః
జ్ఞాత్వాదేవం ముచ్యతే సర్వపాశైః!! (శ్వేతాశ్వతరోపనిషత్తు)
’విద్వాంసుడు (జ్ఞాని) పుణ్యపాపములనుండి విడివడి, ఆత్మను ఎరిగి సమస్త పాశముల నుండి ముక్తుడౌతాడు.’
శుకాదులు ముక్తులు. వారున్న ’పరమగతి’ నారాయణ తత్త్వమే. ఆ తత్త్వం నాశనరహితం. అందుకే అక్కడ చేరిన వారు తిరిగి వెనకకు రారు.
No comments:

Powered By Blogger | Template Created By Lord HTML