గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 27 June 2014

"నడిరేయి ఏ జాములో స్వామి నినుచేర దిగివచ్చునో... తిరుమల శిఖరాలు దిగివచ్చునో... మముగన్న మాయమ్మ అలివేలు మంగ..

"నడిరేయి ఏ జాములో స్వామి నినుచేర దిగివచ్చునో... తిరుమల శిఖరాలు దిగివచ్చునో... మముగన్న మాయమ్మ అలివేలు మంగ.. 

పతిదేవు ఒడిలోన మురిసేటి వేళ.. స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ..." అంటూ భక్త జనావళి స్వామివారి కరుణ తమమీద ఉండేలా చూడాలని అమ్మవారికి విన్నవించుకోవటం మామూలే..! అయితే ఈ అయ్యవారిని ఏడుకొండలూ ఎక్కి చూడలేకపోతేనేం.. స్వయంభువుగా ప్రత్యక్షమైన చిన్న తిరుపతి అయ్యవారి కరుణ తమమీద ఉంటే చాలదా అన్నట్లుగా పరమ పవిత్రమైన "ద్వారకా తిరుమల"ను పశ్చిమగోదావరి వాసులు దర్శించుకుంటుంటారు.

ఏలూరు పట్టణం నుంచి 42 కిలోమీటర్ల దూరంలోనున్న శేషాద్రి కొండపైన శ్రీ వేంకటేశ్వర స్వామివారు "ద్వారకా తిరుమల"లో కొలువుదీరి ఉన్నారు. స్వయంభువుగా ప్రత్యక్షమైన స్వామివారిని చీమలపుట్ట నుంచి వెలికి తీసిన ద్వారక అనే ముని పేరు మీదుగా ఈ ఆలయానికి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చనట్లు పూర్వీకుల కథనం. సుదర్శన క్షేత్రమైన ఈ ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా కూడా ప్రసిద్ధి చెంది.. అశేష భక్త జనావళి నీరాజనాలు అందుకుంటోంది.

"తిరుమల" స్వామివారికి మ్రొక్కిన మ్రొక్కును "చిన్న తిరుపతి"లో తీర్చుకున్నా అదే ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అయితే చిన్నతిరుపతిలో తీర్చుకునేందుకు మ్రొక్కిన మ్రొక్కును చిన్నతిరుపతిలోనే తీర్చుకోవాలని భక్తులు, స్థానికులు ప్రగాడంగా నమ్ముతుంటారు. ఇక్కడ స్వామివారిని కలియుగ వైకుంఠ వాసునిగా భావించి సేవిస్తారు. తిరుపతికి వెళ్ళలేని భక్తులు తమ ముడుపులను, తలనీలాలను, మొక్కుబడులను ఇక్కడ సమర్పిస్తే తిరుపతి స్వామివారికి చెందుతాయని భావిస్తారు.
ద్వారకుడు ఉత్తరాభిముఖుడై తపస్సు చేశాడట. అయితే ఆ మునికి ప్రత్యక్షమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారు దక్షిణాభిముఖుడై ఉన్నాడట. అందుకనే.. ఈ ఆలయంలో మూలవిరాట్టు దక్షిణముఖంగా ఉండటం విశేషంగా చెప్పవచ్చు. అలాగే ఒకే విమాన శిఖరం క్రింద రెండు విగ్రహాలు ఉండటం ఇక్కడి మరో విశేషం. ఒక విగ్రహం సంపూర్ణమైనదిగా, రెండవది స్వామివారి పై భాగం మాత్రమే కనిపించేటట్లుగా ఉండే అర్థవిగ్రహంగా ఉంటుంది.

స్థల పురాణం ప్రకారం చూస్తే... ద్వారకా తిరుమల క్షేత్రం శ్రీరాముని తండ్రి దశరథ మహారాజు కాలం నాటిదిగా భావిస్తున్నారు. ద్వారకుడు అనే ఋషి తపస్సు చేసి స్వామివారి పాద సేవను కోరారట. దాంతో స్వామివారి పాదములను మాత్రమే పూజించే భాగ్యం అతడికి దక్కింది. అందుకే మనకు నేడు స్వామివారి పై భాగం మాత్రమే దర్శనమిస్తుంది.

అయితే.. విశిష్టాద్వైత బోధకులైన శ్రీ రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించారనీ... అప్పుడు భక్తులందరి విన్నపాలను స్వీకరించిన ఆయన స్వామి పాదపూజ చేసుకొనే భాగ్యం కలిగించడానికి మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయంవ్యక్త ధృవమూర్తికి వెనుకవైపు పీఠంపై.. వైఖాన సాగమం ప్రకారం ప్రతిష్టించారని చెబుతుంటారు.

అందుకే.. స్వయంభువుగా వెలసిన, అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే శ్రీ వేంకటేశ్వర ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందనీ.. ఆ తరువాత ప్రతిష్టింపబడిన పూర్తిగా కనిపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్థ కామపురుషార్ధములు సమకూరుతాయనీ భక్తులు నమ్ముతుంటారు.

పురాణ గాథల ప్రకారం ఆలయ చరిత్రను చూసినట్లయితే... బ్రహ్మపురాణం ఆధారంగా, శ్రీరామచంద్రుడి తాతగారు అజమహారాజు తన వివాహం కోసం స్వామివారిని సేవించారు. ఆయన ఇందుమతి స్వయంవరానికి వెళుతూ.. మార్గమధ్యంలో ఉన్న ద్వారకా తిరుమలలో ఆగి స్వామివారిని దర్శించుకోకుండానే వెళ్లిపోయారట. ఇందుమతి అజమహారాజును పెళ్లి చేసుకున్నప్పటికీ.. స్వయంవరానికి వచ్చిన ఇతర రాజులు ఆయనపై దాడి చేస్తారు.

తాను మార్గమధ్యలో స్వామివారిని దర్శించుకోకుండా వెళ్లినందుకే ఇలా జరిగిందని భావించిన అజమహారాజు శ్రీవేంకటేశ్వరుని క్షమించమని ప్రార్థిస్తాడు. అంతటితో ఆ అలజడి ఆగిపోయిందట. అత్యంత ప్రాచీన చరిత్రగల ఈ ఆలయం కృతయుగం నుంచి ఉందనేందుకు ఇదో చక్కని నిదర్శనంగా చెప్పవచ్చు.

ఇక.. ద్వారకా తిరుమలలోని స్వామి వారికి అభిషేకం చేయకపోవటం మరో విశేషంగా చెప్పవచ్చు. ఎందుకంటే.. స్వామివారిపై ఒక చిన్న నీటి బొట్టుపడినా.. అది స్వామివారి విగ్రహం క్రిందనుండే ఎర్రచీమలను కదుల్చుతుందని అభిషేకం చేయరు. గుడి సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ, ఆశ్వయుజ మాసాలలో రెండు కళ్యాణోత్సవాలు జరుపుతుంటారు. ఎందుకంటే.. స్వామివారు స్వయంభువుగా వైశాఖ మాసంలో దర్శనమిచ్చారనీ, సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయుజ మాసంలో ప్రతిష్టించిన కారణంగా అలా చేస్తుంటారు.
ప్రస్తుతం ఉన్న ద్వారకా తిరుమల ఆలయాన్ని మైలవరం జమీందారులు కట్టించారట. విమాన మంటపము, గోపురము, ప్రాకారాలను అప్పారావు అనే వ్యక్తి... బంగారు ఆభరణాలు, వెండి వాహనాలను రాణీ చిన్నమ్మరావు స్వామివారికి సమర్పించినట్లు పూర్వీకుల కథనం.

ఈ ఆలయంలో ఐదు అంతస్తులు కలిగిన ప్రధాన రాజగోపురం దక్షిణంవైపుకు వుంటుంది. మిగిలిన మూడు గోపురాలు మూడు దిక్కులా వుంటాయి. నాగర శిల్పి రీతిలో విమానగోపురం తయారైంది. పాతముఖ మండపాన్ని నవీకరించి విస్తరించి, పాలరాతితో సువిశాలంగా తీర్చిదిద్దారు. వివిధ రకాల చెట్ల పచ్చదనంతో, చల్లని ప్రశాంత వాతావరణంగల ఈ ఆలయ పరిసరాలు సందర్శకులకు పవిత్రానుభూతిని కలిగిస్తాయి.

ఆలయంలోకి ప్రవేశించగానే కళ్యాణ మండపం వస్తుంది. ఈ మండపం దాటి మెట్లు ఎక్క్ ప్రారంభంలోని పాదుకా మండపంలో స్వామివారి పాదాలుంటాయి. శ్రీవారి పాదాలకు నమస్కరించిన తరువాతే భక్తులు పైకి ఎక్కుతారు. పైకి వెళ్లే మెట్ల మార్గంలో రెండు వైపులా దశావతార విగ్రహాలు భక్తుల్ని పరవశింపజేస్తాయి. మెట్లకు తూర్పున అన్నదాన సత్రం, ఆండాళ్ సదనం.. పడమటివైపు పద్మావతీ సదనం, దేవాలయ కార్యాలయం, నిత్య కళ్యాణ మండపాలుంటాయి.

ప్రధాన ద్వారం లోపలి రెండువైపులా.. గర్భగుడికి అభిముఖంగా.. ద్వారకాముని, అన్నమాచార్యుల విగ్రహాలున్నాయి. ద్వారం లోపలి పైభాగాన సప్తర్షుల విగ్రహాలు... గర్భగుడి చుట్టూ ఉండే ప్రదక్షిణ మార్గం వెంట ప్రహరీని ఆనుకుని 12 మంది ఆళ్వారుల ప్రతిమలు ఉన్నాయి. ప్రదక్షిణా మార్గంలో దీపారాధన మండపం, ప్రధాన మందిరంలో ధ్వజస్తంభం వెనుకవైపున ఆంజనేయస్వామి, గరుడస్వామిల చిన్న మందిరాలున్నాయి.

గర్భగుడిలో స్వయంభువు శ్రీ వేంకటేశ్వర స్వామి అర్ధ విగ్రహం, రామానుజులుచే పూర్తిగా ప్రతిష్టింపబడిన వేంకటేశ్వరస్వామి ప్రతిమలు కన్నులపండువగా దర్శనమిస్తాయి. ఆ ప్రక్కనే కుడివైపు అర్ధ మంటపంలో తూర్పు ముఖంగా మంగతాయారు, అండాళ్ (శ్రీదేవి, భూదేవి) అమ్మవార్లు కొలువై ఉన్నారు. శుక్రవారం అమ్మవార్లకు విశేష కుంకుమపూజను నిర్వహిస్తుంటారు.

ప్రధానాలయానికి తూర్పువైపున యాగశాల, వాహనశాల, మహానివేదనశాలలు.. పడమటివైపున తిరువంటపడి పరికరాలశాల ఉన్నాయి. నాలుగు దిక్కులా నాలుగు గాలి గోపురాలున్నాయి. వీటిలో పెద్దదైన దక్షిణ దిక్కు గాలిగోపురం ఐదు అంతస్థులది. గోపురములో చక్కని దక్షిణ భారత శిల్పశైలిని దర్శించవచ్చు. పడమరవైపు ప్రక్కనే తలనీలాలు సమర్పించుకొనే కళ్యాణ కట్ట ఉన్నది. కళ్యాణ కట్ట వద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, ఒక నంది విగ్రహం ఉన్నాయి.

ఆలయం పశ్చిమాన స్వామివారి పుష్కరిణి ఉంది. దీనిని సుదర్శన పుష్కరిణి అని, నరసింహ సాగరమని, కుమార తీర్ధమనీ భక్తులు పిలుస్తుంటారు. ఇక్కడ చక్ర తీర్ధము, రామ తీర్ధము అనే రెండు స్నానఘట్టాలున్నాయి. ఇక్కడి రాళ్ళపై సుదర్శన (చక్రం) ఆకృతి ఉన్నందున ఆ పేరు వచ్చింది. ఇక్కడ ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి (క్షీరాబ్ధి ద్వాదశి) నాడు తెప్పోత్సవం జరుపుతారు.

ఆలయ నిర్వాహకులు ఈ దేవస్థానంలో నిత్యాన్నదానం, గోసంరక్షణ పథకాలు ఏర్పాటుచేశారు. వీటికై ఎందరో భక్తులు విరాళాలను సమర్పిస్తూ వుంటారు. శాస్త్ర ప్రకారం గంగ, యమున లాంటి నదులు ఉత్తరదిశవైపు నదీ జన్మస్థానానికి దగ్గరైనకొద్దీ వాటి పవిత్రత పెరుగుతుంది. అలాగే దక్షిణానగల కృష్ణ, గోదావరి నదులు సముద్ర ముఖద్వారానికి దగ్గరైన కొద్దీ వాటి పవిత్రత పెరుగుతుంది. బ్రహ్మపురాణం ప్రకారం కృష్ణ, గోదావరి నదులతో పూదండలా ఆవరించబడిన ఈ పవిత్ర ప్రదేశం చాలా ప్రభావవంతమైనది. అందుకే స్వామివారి కటాక్ష వీక్షణాలకై ఎన్నో ప్రాంతాలనుండి భక్తులు ద్వారకా తిరుమలకు తరలివస్తుంటారు.

ద్వారకా తిరుమలకు చేరుకోవడం ఎలాగంటే...? విజయవాడ-రాజమండ్రి మార్గంలో ఏలూరుకు 41 కి.మీ., భీమడోలుకు 17 కి.మీ., తాడేపల్లి గూడెంకు 47 కి.మీ. దూరంలో ఉంది. ఏలూరు, తాడేపల్లి గూడెంలలో ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ఆగుతాయి. భీమడోలులో పాసెంజర్ రైళ్ళు ఆగుతాయి. ఈ పట్టణాలనుండి, మరియు చుట్టుప్రక్కల ఇతర పట్టణాలనుండి ప్రతిరోజూ ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులను నడుపుతోంది.

ఇక వసతి విషయానికి వస్తే... పద్మావతి అతిధి గృహం, అండాళ్ అతిధి గృహం, రాణి చిన్నమయ్యరావు సత్రం, సీతా నిలయం, టీటీడీ అతిధి గృహంలాంటివి ద్వారకా తిరుమల దేవస్థానం వారిచే విర్వహింపబడుతున్నాయి. ఇంకా కొన్ని ప్రైవేటు వసతి గృహాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఏడుకొండలూ ఎక్కి స్వామివారిని దర్శించుకుని, మొక్కులను తీర్చుకోలేని భక్తులకు ద్వారకా తిరుమల దర్శనం సంతృప్తిని.. తిరుమల వెళ్ళిన అనుభూతిని, ఫలితాన్ని కలుగజేస్తూ భక్తుల నీరాజనాలను అందుకుంటోంది.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML