గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 26 August 2013

సీతారాముల కథలు ఎన్ని విన్నానో!

సీతారాముల కథలు ఎన్ని విన్నానో!
August 25, 2013

"పురాణకాలం నుంచీ రామేశ్వరం హిందువులకు పుణ్యక్షేత్రం. సీతను వెతుకుతూ రాముడు ఇక్కడకొచ్చాడని, ఇక్కణ్నుంచే వానరుల సాయంతో వారధి నిర్మించాడనీ అంటారు కొందరు. అలాకాదు, రామ-రావణ యుద్ధం పరిసమాప్తమయిన తర్వాత లక్ష్మణుడితో సహా సీతారాములిద్దరూ ఇక్కడికొచ్చారని, మా ఊరి గుడిలో ఉన్నది సాక్షాత్తూ సీతాదేవి స్వహస్తాలతో రూపొందించిన సైకత లింగమని మరికొందరంటారు. మొత్తానికి దేశం నలుమూలల నుంచీ వచ్చిపోయే కొద్దిమంది యాత్రికుల (ఆనాడు) కోలాహలం తప్పిస్తే, మా ఊరు రామేశ్వరం సాధారణమైన పల్లెటూరు. ఊళ్లో మసీదు, చర్చి ఉన్నా, దేవాలయానిదే హడావుడి అంతా.సముద్రమే అన్నిటికీ

ఊరన్నాక వచ్చే చిన్నచిన్న గొడవలు తప్పిస్తే, మా ఊరు చాలా ప్రశాంతమైన ఊరు. రామేశ్వరం వంటి చిన్న దీవిలో పుట్టిపెరగడం వల్ల మా జీవితాల్లో సముద్రానికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. మేమూ మా ఇరుగుపొరుగు కుటుంబాలు కూడా సముద్రం మీద ఆధారపడినవాళ్లమే. కొందరు మత్స్యకారులు, మరికొందరు బోటు యజమానులు. మిగతావాళ్లలో ఎక్కువమంది చిల్లరమల్లర వ్యాపారస్తులు. మా ఊరొచ్చిన వచ్చిన భక్తులంతా సాగర సంగమంలో స్నానం చెయ్యాలని దగ్గర్లోనే ఉన్న ధనుష్కోడికి తప్పకుండా వెళుతుంటారు. ఈ రెండు ఊళ్లకు మధ్య దూరం 22 కి.మీ. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం కలిసే పవిత్ర ప్రదేశం ధనుష్కోడి. ఇప్పుడంటే రోడ్లు, వాటిమీద సర్రున జారిపోయే వాహనాలు వచ్చాయిగానీ, మా చిన్నప్పుడు రామేశ్వరం నుంచి ధనుష్కోడికి వెళ్లాలంటే పడవలే మార్గం. వాటిని నడిపేవాళ్లకు మంచి ఆదాయం వ చ్చేది.

కలప నుంచి పడవ వచ్చింది

తన సంపాదన సరిపోక, మా నాన్న కూడా ధనుష్కోడి - రామేశ్వరం మధ్య యాత్రికులను అటూఇటూ తిప్పడానికి ఒక ఫెర్రీ నడపాలని నిర్ణయించుకున్నారు. ఆయనకా ఆలోచన రావడం, దానికి తగ్గట్టుగా బోటును నిర్మించడం - నాకిప్పటికీ గుర్తే. సముద్రతీరంలోనే బోటు నిర్మాణం ప్రారంభించారు మా నాన్న. కొన్ని కొయ్యదుంగలు, కాసిని ఇనప మేకులు కలిసి ఒక బోటుగా రూపుదిద్దుకోవడాన్ని చూడటమే నేను ఇంజనీరింగ్ ప్రపంచంలోకి వేసిన తొలి అడుగు. కావలసిన కలప సేకరించాక, పెద్దపెద్ద కొయ్యలను కావలసిన ఆకారంలోకి కోసి, ఆరబెట్టి, తర్వాత నునుపు చేసి ముందుగా అడుగుభాగం, తర్వాత అంచులు, ఆపై మొత్తం పడవ తయారవడం చూడటం ఎంతో గొప్పగా ఉండేది నాకు. దాన్ని నిర్మిస్తున్న చోటికి వెళ్లడానికి ప్రతిరోజూ ఎంత ఆత్రపడేవాణ్నో మాటల్లో చెప్పలేను. తర్వాత పెద్దయ్యాక పెద్దపెద్ద రాకెట్ల తయారీ గురించి చదువుకున్నాను, క్షిపణుల ప్రయోగాలను నేర్చుకున్నాను గానీ, చిన్నప్పుడు కలప నుంచి పడవ రూపుదిద్దుకోవడం చూసినంత అద్భుతంగా మరేదీ అనిపించలేదు!

జలాలుద్దీన్ వచ్చాడోచ్

ఈపడవ నిర్మాణం నా జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది. ఎలాగంటే బోటు నిర్మాణంలో మా నాన్నకు సాయపడటానికి మా బంధువు అహ్మద్ జలాలుద్దీన్ వచ్చాడు. ఆయన నాకన్నా ఎంతో పెద్దవాడుగానీ, ఎందుకో మా మధ్య మంచి స్నేహం కలిసింది. నాలోని నేర్చుకోవాలన్న తపనను, ప్రశ్నించే తత్వాన్నీ మొట్టమొదట గుర్తించిందాయనే. నేను చెప్పేవి శ్రద్ధగా వినడం, ఏదైనా అడిగితే చక్కగా చెప్పడం చేస్తుండేవాడాయన. ఆయనకు ఇంగ్లీషు రాయడం, చదవడం వచ్చు. దాంతో ఆయన బోలెడుమంది శాస్త్రవేత్తల గురించి, ఎన్నెన్నో ఆవిష్కరణలు, సాహిత్యం, సంగీతాల గురించి మాట్లాడేవారు. రామేశ్వరం వీధుల్లోనో, సముద్రపుటొడ్డునో ఆయనతో పాటు నడవడం, మాట్లాడటం వల్ల నా బుర్రలో ఎన్నో ఆలోచనలు, ఆశయాలు రూపుదిద్దుకునేవి.

ఎన్నిసార్లు విన్నానో

మా నాన్న మొదలెట్టిన పడవ వ్యాపారం బాగా పుంజుకుంది. దాన్ని నడపడానికి ఆయన కొందరు పనివాళ్లను కూడా పెట్టుకున్నారు. ఒక్కొక్కసారి నేను కూడా యాత్రికుల బృందాలతో కలిసిపోయి పడవలో అటూఇటూ ప్రయాణం చేసేవాణ్ని. రాముడు లంకకు వారధి కట్టడం గురించి, హనుమంతుడి రాక ఆలస్యమైతే సీతమ్మ సైకత లింగాన్ని పూజించడం గురించి ఎంతమంది నోటివెంట ఎన్నెన్ని వైనాలుగా విన్నానో నాకే తెలియదు! దేశంలోని నలుమూలల నుంచి వచ్చే యాత్రికుల మధ్య పెరగడం నా వరకు నాకు చాలా ముఖ్యమైన విషయం. వాళ్లలో ఎవరో ఒకరు చిన్నపిల్లవాణ్నని నాతో మాటలు కలిపేవారు, కథలు చెప్పేవారు, తాము ఎందుకు యాత్రలు చేస్తున్నారో చెప్పేవారు... మొత్తానికి ఇలా సముద్ర కెరటాలు, ఇసుక మేటలు, కథలు, కేరింతల మధ్య రోజులు గడిచిపోయాయి.

తుపానుల్లో మా నాన్న

బంగాళాఖాతం ఎక్కువ తుపాన్లకు గురవుతూ ఉంటుంది. ముఖ్యంగా నవంబరు, మే చాలా ప్రమాదకరమైనవి. మా చిన్నప్పుడు విరుచుకుపడిన ఒక తుపాను రాత్రి నాకెంతో వివరంగా గుర్తుంది. కరెంటు కూడా లేని ఆ రోజుల్లో ఇంట్లోని నూనెదీపాలు సుడిగాలికి నిలబడలేకపోయాయి. వర్షం ఈడ్చికొట్టింది. అమ్మ ఒడిలో దూరి ఆ రాత్రి ఎలా గడుస్తుందా అని బెంగపడ్డాను. నా ఆలోచనలు పదేపదే సముద్రం మీదికే పోయేవి. అక్కడెవరైనా చిక్కుకుపోయారేమో, వాళ్ల సంగతేమిటి అని తీవ్రంగా ఆలోచించాను. అమ్మ లేకుండా అంతంత దూరాలు అసలు ఎవరైనా ఎలా వెళ్తారో నాకు అర్థమయ్యేది కాదు. మర్నాడుదయం తుపాను పోయిన తర్వాత అది సృష్టించిన విలయాన్ని చూసి మా కళ్లను మేమే నమ్మలేకపోయాం.

గంటకు 150 కి.మీ. వేగంతో వీచిన గాలులు చెట్లుపుట్టలను, ఇళ్లను కూకటివేళ్లతో సహా పెకలించి పారేశాయి. అన్నిటికన్నా సమస్య ఏమంటే ఆ తుఫాను మా కడుపు మీద కొట్టింది. మాకు జీవనాధారంగా ఉన్న పడవ ముక్కముక్కలైపోయింది. అది అలా అయిపోతుంద ని మా నాన్నకు ముందురోజు రాత్రే తెలిసుండవచ్చు. అయినా ఆయన తన ఆందోళనను కప్పిపుచ్చి, పిల్లల్లో నిశ్చింతను నింపి నిద్రపుచ్చారు. ఆ ఒక్కసారే కాదు, ఆ తర్వాత రెండుమూడుసార్లు కూడా తుపాన్లలో పడవ నాశనమైపోతే నాన్న మళ్లీమళ్లీ దాన్ని నిర్మించుకున్నారు. శాటిలైట్ లాంచ్ వెహికిల్ (ఎస్ఎల్‌వీ) రాకెట్, పృథ్వి, అగ్ని వంటి మిసైల్స్ పరీక్షల్లో పరిశ్రమిస్తున్నప్పుడు, ఏ వాన వల్లనో వాటి ప్రయోగం ఆగిపోయినప్పుడు - తుపాను మర్నాడుదయం మా నాన్న ముఖం ఎలాగుండేదో అదే గుర్తొచ్చేది. ప్రకృతి శక్తిని గుర్తించ డానికి, సముద్రం మీద ఆధారపడి బతికే జీవితానికి, కనురెప్ప మూసి తెరిచేంతలో నిన్ను మించిన శక్తి నీ కలల్ని ఆశయాల్నీ కల్లలు చెయ్యగలదని తెలుసుకోవడానికి, నీ జీవితాన్ని నువ్వు మళ్లీమళ్లీ నిర్మించుకోవడం తప్పదన్న విషయానికీ మా నాన్న ముఖం ఒక ప్రతీకగా అనిపిస్తుంది.

యుద్ధం తెచ్చిన కష్టాలు

ఒక్క క్లిక్కుతో గుట్టలుగుట్టలుగా సమాచారం వచ్చిపడటం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మామూలుగానైతే - ఇంజనీరింగ్, సైన్స్ రంగాలకు సంబంధించిన వ్యక్తిగా నేను సాంకేతికత సృష్టిస్తున్న అద్భుతాలను చూసి ఇంత ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ డెబ్భైఏళ్ల కిందటి జీవితాలనూ, ఇప్పటి జీవితాలనూ బేరీజు వేసుకున్నప్పుడు ఈ మార్పు నాకు ఆశ్చర్యకరంగా ఉంటుంది. దక్షిణభారతంలోని ఓ మూలన చిన్న ఊళ్లో గడచిన నా బాల్యం వల్ల కూడా ఇది నాకు మరీ వింతగా ఉంటుంది. నేను 1931లో పుట్టాను. నాకు ఎనిమిదేళ్లున్నప్పుడనుకుంటా రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. అయితే మొదట్లో మా దైనందిన జీవితాల్లో దాని ప్రభావం అంతగా తెలిసేది కాదు.

యుద్ధం ముదురుతున్నకొద్దీ బ్రిటిష్ ప్రభుత్వం అన్నిటికీ రేషన్ పెట్టింది, సరుకుల సరఫరాలను బాగా నియంత్రించింది. అప్పుడు మాత్రం అన్నిటికీ కటకటగానే ఉండేది. మా ఇంట్లో మేం ఐదుగురు పిల్లలం. మేంగాక మా చిన్నాన్న పిల్లలు. మా నాన్నమ్మ, అమ్మ ఎంతో కష్టపడి మా అందరికీ తిండికీ, బట్టకూ కొరత లేకుండా చూసుకునేవారు. గమనించి చూస్తే రోజురోజుకీ వాళ్లిద్దరి కంచాల్లో పెట్టుకున్న అన్నం త క్కువైపోతూ ఉండేది. ఎందుకంటే ముందు పిల్లలందరికీ పెట్టి తర్వాత ఎంత మిగిలితే అంతే వాళ్లు తినేవాళ్లు. పిల్లల్లో ఎవరూ అర్థాకలితో బాధపడిన జ్ఞాపకమేదీ నాకు లేనేలేదు!

సంసుద్దీన్ స్నేహం

మా ఊరిని బైట ప్రపంచంతో కలిపేవి దినపత్రికలే. ఆ ఏజెన్సీని మా బంధువు సంసుద్దీన్ నడిపేవాడు. మా ఊళ్లో అదొక్కటే ఏజెన్సీ. అప్పటికి మా ఊళ్లో చదువొచ్చినవాళ్లు ఓ వెయ్యిమంది ఉంటారేమో. వాళ్లందరికీ పేపర్లు చేరవెయ్యడం సంసుద్దీన్ పని. అప్పటికి ఉధృతంగా ఉన్న మన స్వాతంత్య్ర ఉద్యమం గురించిన వార్తలే ఎక్కువగా ఉండేవి. వాటిని అందరూ ఆతృతగా చదివి ఉద్వేగంగా చర్చించుకునేవారు. అప్పట్లో 'దినమణి' బాగా పేరున్న తమిళ దినపత్రిక. జలాలుద్దీన్‌లాగానే ఈయన కూడా నా జీవితం మీద అమితమైన ప్రభావం చూపిన మనిషి. ఈయన కు చదవడం, రాయడం వచ్చుగానీ బాగా చదువుకున్నవాడనీ, లోకం తిరిగినవాడనీ అనలేం. కానీ అతనికి నేనంటే చాలా ఆప్యాయత. నాకొక మార్గదర్శిగా ఉండేవాడు. సంసుద్దీన్, జలాలుద్దీన్ - వీళ్లిద్దరూ నేను చెప్పకముందే నా భావాలను అర్థం చేసుకునేవారు.

తొలి బాధ్యత

మా ఊరికి దినపత్రికలు తెచ్చే రైలు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మా ఊళ్లో ఆగకుండా వెళ్లిపోవడం మొదలెట్టింది. దీంతో పాఠకులకు వార్తలు అందవు, మరోవైపు సంసుద్దీన్ వ్యాపారం దెబ్బతింటుంది. అప్పుడు ఆయన మా ఇంటికొచ్చి నా సాయం అడిగాడు. అదేంటంటే రామేశ్వరం - ధనుష్కోడి ట్రాక్ దగ్గర రైలు నెమ్మదిగా వెళుతున్నప్పుడు రైల్లోంచి ఒకరు పేపర్ల కట్ట ప్లాట్‌ఫామ్ మీదకు విసిరేస్తారు. నేను దాన్ని జాగ్రత్తగా పట్టుకుని చందాదారులకు పేపర్లు అందించాలి. ఆయన ఇచ్చిన ఆఫర్‌కు నేను ఎగిరి గంతేశాను. ఎందుకంటే అప్పటికి నా వయసు ఎనిమిదేళ్లే. అప్పుడే నేను కుటుంబానికి ఆర్థికంగా ఆసరా అవుతున్నానన్న ఆనందం నన్ను నిలవనివ్వలేదు.

రోజంతా పరుగే

అయితే అది చాలా కష్టమైన పని. ఎందుకంటే అప్పటికే మా నాన్న నన్నో లెక్కల మాస్టారి దగ్గర ట్యూషన్‌కు పెట్టారు. ఇప్పుడు ఏదైనా సబ్జెక్టు రాకపోతే ట్యూషన్ పెడుతున్నారు, కాని మా నాన్న నాకు లెక్కలు బాగా వస్తున్నాయి కనుక, మరింత సానబెడితే మంచిదన్న ఆలోచనతో పెట్టారు. ఆ లెక్కల మాస్టారింటికి ఉదయం నాలుగింటికల్లా స్నానం చేసి వెళ్లాలి. నా ట్యూషన్, చదువు ఏమీ పాడవకుండా న్యూస్‌పేపర్ల పని చెయ్యాలి. దాంతో ఉదయం ఇంకా చీకటిచీకటిగా ఉండగానే లేపేసేది మా అమ్మ. నాలుగు నుంచి ఐదింటి వరకూ మా మాస్టారింట్లో చదువుకుని ఇంటికొచ్చేసరికి మా నాన్న సిద్ధంగా ఉండేవాడు. ఆయన నన్ను దగ్గర్లోని అరబిక్ పాఠశాలలో ఖురాన్ షరీఫ్ చదవడానికి తీసుకెళ్లేవారు. అదయ్యాక నేను బాణంలాగా రైల్వేస్టేషన్‌కు పరుగెత్తుకుంటూ వెళ్లేవాణ్ని. మద్రాస్ - ధనుష్కోడి మెయిలెప్పుడూ ఆలస్యమయ్యేది కాదు. మేం ముందుగా అనుకున్న చోటికి రాగానే రైల్లో ఉన్న సంసుద్దీన్ మనిషి పేపర్లు విసిరేసేవాడు, నేను వాటిని ప్రాంతాల వారీగా పేర్చుకుని గంటసేపు ఊరంతా తిరిగి పంచేవాణ్ని. నెమ్మదిగా నాకు పాఠకులు పరిచయమయ్యారు. ఎక్కువమంది ఆత్మీయంగా పలకరించేవాళ్లు.

'తొరగా ఇంటికి వెళ్లరా బాబూ, స్కూలుకు లేటవుతావు' అని చెప్పేవారు. నేను బాగా ఆకలితో వస్తానని తెలిసి, ఇంటికొచ్చేసరికి మా అమ్మ తినడానికి ఏదోకటి పెట్టేది. సాయంత్రం స్కూలు నుంచి వచ్చాక ఉదయం పేపర్లిచ్చిన వాళ్లందరిళ్లకూ వెళ్లి బిల్లులు వసూలు చేసేవాణ్ని. అవి సంసుద్దీన్‌కు అప్పజెప్పేశాక, ఆ రోజుకు నా పని అయిపోయినట్టు. నేను జీవితంలో చేపట్టిన మొట్టమొదటి బాధ్యత అదే. సాయంత్ర సమయాల్లో బీచ్ ఒడ్డున కూర్చుని ఆయనా, జలాలుద్దీన్ బిగ్గరగా వార్తలు చదివేవాళ్లు. గాంధీ, కాంగ్రెస్, హిట్లర్, పెరియార్ ఈవీరామసామి... ఇలాంటి పేర్లెన్నో నా చెవిన పడేవి. ఏదోఒకరోజు నేను కూడా మద్రాసు, బొంబాయి, కలకత్తా వంటి పెద్ద నగరాలకు వెళతానేమో, అప్పుడు గాంధీ నెహ్రూ వంటి పెద్దపెద్దవాళ్లను కలిస్తే ఏం మాట్లాడాలి? అని ఆలోచించుకుంటూ ఉండేవాణ్ని.

నల్లబ్బాయి

ఇలాంటి రొటీన్ ఒక ఏడాదిపాటు నడిచింది. ఆ ఏడాదిలో నేను పేపర్ల పనిలో భాగంగా ఎక్కువ నడవడం, పరుగెత్తడం వల్ల బాగా పొడవయ్యాను, అంతే నల్లబడ్డాను. ఏడాది గడిచేసరికి నేను చేతిలో ఎన్ని పేపర్లతో ఎంత సమయంలో ఎంత దూరం పరుగెత్తగలనో అంచనా వేసుకోగలిగేవాణ్ని. అలాగే పాఠకుల్లో ఎవరెవరు ఎంత బాకీ ఉన్నారో, ఆరోజు చెల్లించిన మొత్తమెంతో - ఇవన్నీ బుర్రలోనే లెక్కలు వేసుకోగలిగేవాణ్ని. ఆరోజు ఎవరెవరు డబ్బులివ్వలేదో కూడా గుర్తుండేది. హోమ్‌వర్క్, ట్యూషన్, ఖురాన్, స్కూలు - ఎన్నున్నా, పెద్ద ఉద్యోగస్తుడిలాగా నా పనికి నేను సిద్ధంగా ఉండేవాణ్ని. ఆ రోజుల్లో ప్రతి నిమిషాన్నీ నేను ఆస్వాదించాను. అంత చిన్న వయసులో నేను పడుతున్న కష్టానికి మా అమ్మ నొచ్చుకుంటూ నావైపు చూసేది... కానీ నేను 'అదేం లేదమ్మా' అంటూ నవ్వేసేవాణ్ని. నా పనికి మా అమ్మ లోలోపల గర్వపడుతూనే ఉండేదనుకుంటాను.'No comments:

Powered By Blogger | Template Created By Lord HTML