గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 14 December 2012

అనసూయా దేవి పాతివ్రత్య మహిమ :


సప్త మహర్షులలో అత్రి మహర్షి ఒకరు. అత్రి అనగా త్రిగుణములకు అతీతుడని,అనసూయ అనగా అసూయలేనిది అని అర్ధం. అత్రి మహర్షి ఒకనాడు అనసూయా మాతను పరీక్షించదలచి ధ్యానానికి కూర్చుంటూ నీరు తెమ్మని కోరి, ధ్యానంలో తీవ్రమైన సమాధిస్థితిలోకి వెళ్లారు. భర్త యొక్క తపస్సును భంగపరచరాదని తలచి ఆమె అత్రి ముని సమాధిస్థితి నుండి బయటకు వచ్చే వరకు, అనగా పన్నెండు సంవత్సరములు అక్కడే వేచి ఉంది. పన్నెండు సంవత్సరముల తర్వాత ధ్యానస్థితి నుండి మేల్కొన్న అత్రి మహర్షి నీరు ఇవ్వడానికి సిద్ధంగా తన ఎదురుగా వేచి వున్న భార్య పతిభక్తికి సంతుష్టులయ్యారు.

**పతిని సేవించడం ద్వారానే పాతివ్రత్యం గుర్తించబడుతుందనే విషయం ఇక్కడ గమనార్హం. అత్రి మహర్షుల వారు సాక్షాత్తు భగవంతుడే, కానీ సామాన్యులమైన మనం అలా కాదుగా. ఇక్కడ పతి అంటే భర్త యొక్క రూపాన్నిగాక, ఆయనలో వున్న భగవంతుడు అని అర్ధం చేసుకోవాలి. భర్త రూపంలో భగవంతుడ్ని సేవిస్తున్నాను అనుకునే స్త్రీ, సాధారణ భార్య స్థాయిని దాటి 'సాధకురాలవుతుంది', భావమే భక్తిలో ప్రధానం. "సాధనమున పనులు సమకూరు ధరలోన" అన్నారు. అంటే ఏదైనా సాధించడానికి ఓ సాధనని ఏర్పాటుచేసుకొని నిరంతరం దాన్నే సాధన చేస్తూ పోతే ఈ భూమిలో సాధ్యంకానిది ఏమీ లేదు అని అర్ధం.

త్రిమూర్తుల భార్యలు ఎవరికివారు తమని మించిన పతివ్రతలేదని గర్వితులయ్యారని గ్రహించిన నారద మహర్షి, వారికి కనువిప్పు కలిగించదలచి ఒకనాడు త్రిమూర్తుల భార్యల వద్దకు ఇనుప గింజలను పట్టుకుని ఒక్కొక్కరి వద్దకు విడివిడిగా వెళ్లి గింజలను వేయించియిస్తే తిని క్షుద్బాధని తీర్చుకుంటానని కోరతాడు. అవి ఇనుప గింజలు కనుక ముగ్గురూ నిస్సహాయిలై వాటిని ఎవరూ వండలేరని అంటారు.అప్పుడు నారద మహర్షి పతివ్రతలకు సాధ్యంకానిదంటూ ఏమీ ఉండదు, కనుక నేను ముల్లోకాల్లోనూ మహాపతివ్రత అని కీర్తించబడుతున్నఅనసూయా మాతనే ఆశ్రయిస్తానని చెప్పి అత్రి మహర్షుల వారి ఆశ్రమానికి వెళ్తాడు. అవే ఇనుప గింజలను అనసూయా మాతకిచ్చి వాటిని వేయించి పెడితే ఆకలి బాధ తీర్చుకుంటానని చెప్తాడు. అనసూయా మాత మనసులో తన భర్తని స్మరించి వాటిని వేయించి ఇస్తుంది. నారద మహర్షి తృప్తిగా ఆరగించి, జరిగిన విషయాన్ని ముగ్గురమ్మలకూ చెప్తాడు. ఈ విషయాన్ని నమ్మలేని అమ్మలు ముగ్గురూ త్రిమూర్తులని అనసూయా మాత పాతివ్రత్యాన్ని పరీక్షించవలసిందిగా కోరతారు.

తమ భార్యల కోరిక తీర్చదలచిన త్రిమూర్తులు, అత్రి మహర్షి అనుష్టానానికి వెళ్లిన సమయం చూచి మారువేషంలో ఆశ్రమానికి వస్తారు. అతిధులను ఆహ్వానించిన పిదప "మహర్షులవారు అనుష్టానానికి వెళ్లారు కనుక మీకు ఏ విధంగా సేవ చేయగలనని" అనసూయా మాత అడుగుతుంది. తమకు ఆకలిగా ఉందని త్వరితగతిన తమకు భోజనం పెట్టమని అడిగి, వివస్త్రయై భోజనం వడ్డిస్తేనే తాము ఆహారం స్వీకరిస్తామనే షరతు విధిస్తారు. భోజన సమయంలో వచ్చిన అతిధిని ఆకలితో తిప్పి పంపితే, గృహస్తు పుణ్యమూ, తపస్సు వచ్చిన అతిధుల వెంట వెళ్తాయని శాస్త్ర వచనం. పరపురుషుని ఎదుట నగ్నంగా నిలిచినట్లయితే పాతివ్రత్యానికి భంగం కలుగుతుంది. ఇలా అనసూయామాత పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య చిక్కుకున్నప్పటికీ, అత్రి మహర్షుల వారి సాంగత్యం వల్ల తాను పవిత్రురాలినైనందుకు భయపడవలసిన పనిలేదని తలచి అయ్యలారా మీరు ఆసీనులుకండని చెప్పి ఆహారపదార్ధాలు తీసుకురావడానికి వెళ్లింది. పతియే దైవమని తలచే నాకు, పాతివ్రత్యం గురించి భయపడనవసరంలేదని వివస్త్రయై వడ్డించడానికి అతిధుల ముందుకు వచ్చింది. ఆమె పాతివ్రత్య మహిమవల్ల త్రిమూర్తులు ముగ్గురూ పసిపాపలైపోయారు. ఆ పసిపాపలను చూడగానే అనసూయామాతకు మాతృభావం వల్ల స్తన్యం వచ్చింది, వారికి పాలిచ్చి నిద్రపుచ్చుతు ఉండగా అత్రి మహర్షులవారు వస్తారు. దివ్య దృష్టితో జరిగింది తెలుసుకున్న మహర్షుల వారు స్తోత్రం చేస్తారు. స్తోత్రానికి మెచ్చి త్రిమూర్తులు నిజరూపంలో దర్శనమిచ్చి వరం కోరుకోమంటారు. సంతానాపేక్షతో వున్న మాకు మీరే పుత్రులుగా పుట్టి మమ్మల్ని ఉద్ధరించమని కోరుకొంటారు, తధాస్తు అని దీవించి త్రిమూర్తులు అంతర్ధానమవుతారు.

**పతిలోని దైవాన్ని నమ్మి సాధన చేస్తున్న సాధకురాలికి గర్వం పనికిరాదు, గర్వం ఙ్ఞానసముపార్జనకి పెద్ద అడ్డంకి. సాధకురాలికి ఙ్ఞానం సిద్ధించిన తర్వాత ఆమెకు సాధ్యం కానిదంటూ ఉండదు. ఙ్ఞానాన్ని పొందినవారంటే భగవంతుని తత్త్వాన్ని తెలుసుకుని వారిలో ఐక్యమైనవారని అర్ధం. భగవంతునితో ఐక్యమైనవారికి సాధ్యం కానిది ఏముంటుంది.?
 
భగవంతుని అవతారాలు :
------------------------------
పరమ భాగవతుడైన అంబరీష మహారాజుకి, దూర్వాస మహర్షి ఇచ్చిన శాపాన్ని అల్పుడైన తన భక్తుని బదులుగా తాను అనుభవించడానికి భగవంతుడు ఇరవై నాలుగు అవతారాలెత్తాడు. తన సృష్టి రచనలో భాగంగా సృష్టి,స్థితి,లయ లనే పరిణామక్రమంలో ఙ్ఞానం సముపార్జించే అవకాశం కలిగిన మానవులని సృష్టించాడు.ఆ మానవులకి అంతిమ లక్ష్యంగా మోక్షసాధనని ఏర్పరచాడు.మోక్షసాధనకి ధర్మ మార్గాన్ని అవలంభించడమే సరైన మార్గంగా నిర్ణయించి వేదాలని అందించాడు. ఙ్ఞానం సామాన్యులకి అందుబాటులోకి రావడం దుర్లభం అని తలచి తానే వారికి సులువైన రీతిలో ధర్మాన్ని బోధించదలచి ప్రధమంగా శ్రీ గురుదత్తునిగా అత్రి, అనసూయలకి జన్మించాడు. ఇది భగవంతుని ఆవతారపరంపరలో ఆరవది. ఈ అవతారం యొక్క విశిష్టత ఏమిటంటే - మిగిలిన అవతారాలన్నీ తమ తమ కార్యం ముగియగానే మూలంలో నిక్షిప్తమౌతాయి, కానీ దత్తావతారం నాలుగు యుగాల్లోనూ ఉంటూ, యుగాంతం తర్వాత కూడా ఉంటుంది. ప్రతి యుగంలోనూ మానవాళికి ఙ్ఞానం ప్రసాదించడానికి ఈయన ఒక లక్షా ఇరవై ఐదువేల మంది అవధూతలు, మహాత్ముల రూపంలో అవతరిస్తుంటాడు. ఈ అవతారం శాశ్వతం. పరమాత్మకి అభిన్నం.

దత్తాత్రేయుల వారి జన్మ వృత్తాంతం :
-----------------------------------
బ్రహ్మ తన శరీరావయవాల నుండి 1.మరీచి 2.అత్రి 3.అంగీరసుడూ 4.పులస్త్యుడు 5.పులహుడు 7.క్రతువు 8.భృగువు 9.వశిష్టుడు 10.నారదుడు. , అనే పదిమంది పుత్రులను ఉద్భవింపజేసాడు. అయినా తన సృష్టికి సంతృప్తి చెందక తన దేహంలో ఒక భాగం నుండి స్వాయంభువ మనువును పురుషుడిగాను, రెండవ భాగం నుండి శతరూపను స్త్రీగాను ఉద్భవింపజేసాడు. వీరి కలయిక వలన సృష్టి ప్రారంభమైంది. వీరికి 1.ప్రియవ్రతుడు 2.ఉత్తానపాదుడు అనే కుమారులు, 1.అకూతి 2.దేవహూతి 3.ప్రసూతి అనే కుమార్తెలు కలిగారు. అకూతిని ఋచి అనే మునికి,దేవహూతిని కర్దమ మునికి, ప్రసూతిని దక్షునకి ఇచ్చి వివాహం చేసారు.

కర్దమ ప్రజాపతి సంతానం కోసం చేసిన తీవ్ర తపశ్చర్యకు మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమై తానే పుత్రునిగా అతనికి జన్మిస్తానని వరమిచ్చాడు. కర్దమునికి దేవహూతి యందు 1.కళ 2.అనసూయ 3.శ్రద్ధ 4.హవిర్భువు 5.గతి 6.క్రియ 7.ఖ్యాతి 8.అరుంధతి 9.శాంతి అనే కుమార్తెలు కపిలదేవుడనే కుమారుడూ కలిగారు. అనసూయ మాతను, అత్రి మహర్షికిచ్చి వివాహం చేసారు.
 

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML