గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 14 December 2012

కొందరు మంచి స్వామిజిల గురించి part 1

 దత్తప్రభువుల జన్మవృత్తాంతం :
------------------------------------
ఆధిభౌతికం,ఆధిదైవికం,ఆధ్యా త్మికం అనే తాపాలను తొలగించుకున్న అత్రి మహర్షుల వారికి,కామక్రోధాది దుర్గుణాలన్నింటికీ మూలమైన అసూయను జయించిన అనసూయ మాతకు, కృతయుగంలో ఇప్పుటి నేపాల్‌ ప్రాంతంలోని చిత్రకూట పర్వతం వద్దనున్న అనసూయా పహాడ్ అనేచోట ఒకానొక వైశాఖ బహుళ దశమీ గురువారంనాడు రేవతీ నక్షత్రయుక్త మీన లగ్నంలో మీనాంశయందు 'బ్రహ్మ అంశమున చంద్రుడు,విష్ణు అంశమున దత్తుడు, శివ అంశమున దుర్వాసులుగా' దత్తాత్రేయులవారు జన్మించారు. తర్వాత చంద్రుడు,దుర్వాసుడు తమ తమ అంశములను దత్తునిలో నిక్షిప్తం చేసి తపస్సు చేయడానికి వెళ్లిపోయారు.

(బ్రహ్మ నా తండ్రి, మాయ(ప్రకృతి) నా తల్లి వారి ఐక్యం వల్లనే నాకీ దేహం వచ్చింది. నేనే దైవం,శిరిడీలోనూ సర్వత్రా నేనే వున్నాను, సర్వ జగత్తూ నాలోనే వుంది.నీవు చూస్తున్నదంతా కలిపి నేను..నేను శిరిడీలో మాత్రమే ఉన్నాననుకొనేవాడు నన్నసలు చూడనట్లే - అన్న సాయి వాక్కుని సదా స్మరించినట్లయితే ఆయనెవరో క్రమంగా అర్ధం అవుతుంది.)


బాల్య లీలలు :
--------------
ఈ బాలుడు సామాన్యుడు కాదని అఙ్ఞానులను ఙ్ఞానమార్గాన నడిపి కైవల్యము చేర్చే మార్గదర్శకుడని ఙ్ఞానులు ఆయన్ను ప్రసంశించేవారు. దత్తులవారు మాత్రం గురుశుశ్రూష చేయక బాలునిగా, ఉన్మత్తునిగా, పిశాచపీడితునిలా విహరిస్తుండేవారు, అది చూచి సంశయించేవారు ఆయన కృపకి దూరమయ్యేవారు. ఒకసారి ఆశ్రమవాసులు, వయోవృద్ధులు దత్తస్వామిని చేరి గురువై తమను అనుగ్రహించవలసిందని ఆయన్ను కోరారు. దత్తులవారు వారితో ఏమీ మాట్లాడకుండా ఏకాంత నిష్టలో ఉండటానికి బయలుదేరారు, ఆశ్రమవాసులు ఆయన్ను వెంబడించారు. అది గమనించిన దత్తప్రభువు దగ్గరలో వున్న సరోవరంలో దిగి అదృశ్యులయ్యారు.

ఆయన్ను వెంబడిస్తూ వచ్చినవారు ఆయన దర్శనంకోసం అక్కడే వేచివున్నారు. ఇలా 100 సంవత్సరాలు గడిచేవరకు వారి సహనాన్ని, వారి దృఢ సంకల్పాన్ని పరిక్షించిన పిదప దత్తస్వామి వారి నమ్మకాన్ని పరిక్షించదలచి, ఒక స్త్రీని ఎడమతొడపై కూర్చోబెట్టుకుని సరోవరంలోంచి బయటకు వచ్చారు. దత్తులవారు ఈ విధంగా దర్శనమిచ్చినప్పటికీ ఆశ్రమవాసులు దృఢచిత్తులై అక్కడనుండి కదలలేదు. అప్పుడు దత్తులవారు మద్యాన్ని సేవిస్తూ. వెంటతెచ్చిన స్త్రీతో సరసాలాడటం మొదలుపెట్టారు. ఈ ఘటన కొందరిలో చిత్తచాంచల్యాన్ని కలిగించింది, ఇలా చిత్తం చెదిరినవారు - ఇటువంటి దురాచారుడు, స్త్రీలోలుడు ఆశ్రితులనెలా ఉద్ధరిస్తాడు? అంటూ ఆయన్ని విడిచివెళ్లారు(ఇటువంటివారినే శ్రీసాయి బాబా రాలిపోయే పూతతో పోల్చారు). అక్కడే మిగిలిన అతి కొద్దిమంది మాత్రం అక్కడ జరుగుతున్న చర్యల్ని పట్టించుకోకుండా చిత్తాన్ని కేవలం దత్తప్రభువుపైనే నిలిపివుంచి ఆయన్ని ఇలా స్తుతించారు - ఓ మహానుభావా నీవు యోగీశ్వరుడివి, పూర్ణ పరబ్రహ్మ స్వరూపూడివి, నిర్గుణుడవైనప్పటికీ భక్తులనుద్ధరించడానికి ఇలా సగుణరూపంలో సంచరిస్తున్నావు. ఇకనైనా ఈ దీనులని పరిక్షించటంమాని, నీ ఆశ్రయం కోరివచ్చిన మమ్ము ఉద్ధరించు ప్రభూ అంటూ స్తుతించగా, వారి ప్రార్ధనను మన్నించిన దత్తప్రభువు ఆ మునులకు తన నిజరూపాన్ని చూపి అనుగ్రహించారు.

ఈ విధంగా ఆశ్రమవాసుల్ని అనుగ్రహించిన తర్వాత దత్తప్రభువు తన తల్లిదండ్రుల చెంతకు వచ్చి, భక్తులను అనుగ్రహించడానికి, ప్రజలను సన్మార్గవర్తనులను చేయడానికి నేను సహ్యాద్రికి వెళ్లాలి నన్ను ఆశీర్వదించమనగా, సర్వఙ్ఞురాలైన ఆ మాత కూడా పుత్రవ్యామోహముతో అంగీకరించక - నా వద్దనే ఉండు,నన్ను విడిచి వెళ్లకని బ్రతిమాలింది. దత్తుల వారు పట్టు విడవకపోవడంతో - నా వల్ల కలిగిన దేహాన్ని నాకు ఇచ్చి నీ ఇచ్ఛ ప్రకారం నడుచుకోమని నిష్టూరమాడింది. దత్తాత్రేయుల వారు నవ్వుతూ తన చర్మాన్ని గోళ్లతో చీల్చి తన దేహాన్ని తల్లికి ప్రసాదించారు. ఆ దృశ్యాన్ని చూచిన అనసూయమాతకు దేహం నాశనమయినప్పటికీ, ఆత్మ శాశ్వతమనే సత్యం స్ఫురించినదై - కుమారా తల్లికి సహజమైన మాతృవ్యామోహంతో నిన్ను అర్ధం చేసుకోలేకపోయాను, అఙ్ఞానంతో అలమటించే మానవాళికి ఙ్ఞానాన్ని ప్రసాదించే మోక్షమార్గాన్ని అనుగ్రహించు అన్నది.

**వ్యామోహం సత్యాన్ని మరుగుపరుస్తుందనే విషయం తెలియజేయడానికే ఈ లీల జరిగిందని మనం గ్రహించాలి.

దత్తప్రభువు దినచర్య :
---------------------
దిగంబరుడూ,శరీమంతా భస్మం పులుముకొన్నవాడు,ఆత్మ ఙ్ఞానం కలిగించ గలవాడు, సర్వమతాల్లోనూ తన ప్రస్తావన ఏదో ఒక రూపంలో కలవాడు, ఏ అవతారంలోనూ లేని గురుదేవ అన్న విశేషణం కలవాడూ, సదా బ్రహ్మనిష్టకలవాడూ,ప్రసన్నుడు,నిర్మానసుడు ఐన దత్త ప్రభువుల వారు -

ప్రతిరోజూ కాశీలో గంగాస్నానము, మాహురపురములో ధ్యానము, కొల్హాపురిలో (కరవీరపురం) భిక్ష, నిర్మలమైన,స్వచ్ఛమైన తుంగభద్రా నీటితో దాహం తీర్చుకుని, సహ్యాద్రి పర్వతములో నిద్ర చేస్తారు. సహ్యాద్రి కల్పవృక్షము కింద మణిపీఠం ఉంది, దానిపై దత్త ప్రభువు ఆసీనుడై ఉంటాడు. మెడలో మణిహారం, మొలలో బంగారు మొలత్రాడు, వామాంకమున యోగలక్ష్మి మధుమతీదేవి, వెనుక కామధేనువు, నలుదిక్కులా నాల్గువేదాలూ నాలుగు కుక్కలుగా ఆయన పరివేష్టితుడై ఉండగా - ఆయన ముందు సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులూ, నవనాధుల ఆదిగాగల మహ్మాతులు ఆయన్ను స్తుతిస్తూ వుంటారు.కేవలం భిక్షాన్నం మాత్రమే గ్రహించే ఈ ప్రభువుకి అష్టసిద్ధులు,నవనిధులు దాస్యం చేస్తూ ఉంటాయి. ఎడమ చేతిలో త్రిశూలం, శంఖం, కమండలం ధరించి కుడి చేతిలో ఢమరుకం, చక్రం, జపమాల ధరించి ఉండగా గంధర్వుల గానం చేస్తూంటే. అప్సరసలు నృత్యం చేస్తూండగా దత్తప్రభువులు ప్రతిదినమూ దర్బార్ నిర్వహిస్తూవుంటారు. అట్టి ప్రభువు తనను దర్శించి, స్మరించినంత మాత్రానే ఇహ, పర సౌఖ్యాలు కలుగజేస్తుంటాడు.

**శ్రీ దత్తుల వారికి అవధూత అనే బిరుదువున్నది - అవదూతోపనిషత్తు ప్రకారం ఆ పదానికి అర్ధం.

శ్లో II అక్షరద్వాద్వరేణ్యత్వాద్ధూత సంసార బంధనాత్
తత్వమస్యాది లక్ష్యత్వదవదూత ఇతీర్యతే II

తా II నాశరాహిత్యమూ,శ్రేష్టత్వమూ. విదిలించి వేయబడిన సంసారబంధము తత్త్వమసి అనే మహావాక్యానికి లక్షమవ్వడం వలన,అట్టి వారిని అవధూత అని చెబుతారు.


కార్త వీరార్జుని వృత్తాంతం :
-------------------------
త్రేతాయుగంలో ’హైహయ’ వంశానికి చెందిన కృతవీరుడనే చక్రవర్తి ’మహిష్మతి’ పట్టణాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తుండేవాడు. అతని భార్య శీలధారా దేవి. వీరికి ఎంతో మంది సంతానం కలిగినప్పటికీ, చ్యవన మహర్షి శాపం వల్ల ఒక్కరూ బ్రతకడంలేదు. సంతానం నిలబడటానికి ఎన్నో యాగాలు, పూజలు చేసినా ఫలితం లేకపోవడంతో శీలధారా దేవి ఎంతో మనో వేదనకు గురైంది. ఒకరోజు వారికి యఙ్ఞవల్క్య మహర్షుల వారిని దర్శించే భాగ్యం కలిగింది. మహర్షుల వారి సతీమణి మైత్రేయి మాత వారి వ్యధ విని వారికి అనంత వ్రతం చేయమని చెప్పి, వ్రత విధానం తెలియజేసింది. ఆ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నప్పుడు, దేవగురువు బృహస్పతి వారి ఇంటికి విచ్చేసి వారిని సూర్యభగవానుణ్ని కూడా ఆరాధించమని చెప్పి ఆలా చేస్తే పాపాలు నశించి పుత్ర సంతానం కలుగుతుందని తెలియజేస్తాడు. వారు చెప్పినట్లే ఆచరించిన కొన్ని రోజుల తర్వాత శీలధారా దేవి గర్భం ధరించి మగబిడ్డకి జన్మనిచ్చింది. ఐతే ఆ బాలుడు చూడ ముచ్చటగా వున్నప్పటికీ, అతని చేతులు వంకర తిరిగి సన్నగా బలహీనంగా వుండి వేలాడుతున్నాయి. అంగ వైకల్యం గల పిల్లవాడు పుట్టేసరికి వారు ఎంతో దుఃఖించారు. అయినప్పటికీ ఆ బాలుణ్ని వారు ఎంతో ముద్దుగా పెంచసాగారు. ఆ బాలుడికి అర్జునడనే పేరు పెట్టారు. కృతవీర్యుని కొడుకు కావడం వల్ల కార్తవీరార్జునుడయ్యాడు. కొంతకాలానికి కృతవీర్యుడు మరణించాడు. రాజ్యభారం వహించడానికి కార్తవీరునికి అంగవైకల్యం దృష్ట్యా అర్హత లేకపోవడం వల్ల మంత్రులకు రాజ్యాన్ని అప్పగించి తాను తపస్సు ద్వారా శక్తులను పొంది రాజ్యానికి తిరిగి వస్తానని చెప్పి వెళ్లిపోతాడు. గర్గ మహాముని కార్తవీరునికి శ్రీ దత్తాత్రేయుల వారే ఈ వైకల్యాన్ని నివారించగలరని చెప్పి వారిని దర్శించుకోడానికి సహ్యాద్రికి వెళ్లమని రాజుకి చెప్తాడు. దత్తాత్రేయుల వారిని దర్శించినప్పుడు వారు తమ భక్తుల భక్తి శ్రద్ధలను కఠినంగా పరిక్షించి, ఆ తర్వాతే అనుగ్రహిస్తారని చెప్పి దేవేంద్రుడు దత్తుల వారి అనుగ్రహం వల్ల జంభాసురుని ఏ విధంగా వధించాడో తెలియజేస్తారు.

జంభాసురుడు దేవతలని జయించినప్పుడు ఇంద్రుడు దేవ గురువు బృహస్పతిని మార్గం తెలియజేయమని అడుగుతాడు. అప్పుడు బృహస్పతి సహ్యాద్రి పై కొలువై ఉన్న దత్త ప్రభువులే ఈ సమస్యని పరిష్కరించగలరని చెప్పి, ఆయన అనుగ్రహం పొందడంలో ఎదురయ్యే ఆటంకాలు జయించిన వారికే ఆయన తన నిజరూప దర్శనమిస్తాడని, దానికి ఎంతో భక్తి, శ్రద్ధలు అవసరమని చెప్తాడు. ఇంద్రుడు సహ్యాద్రికి చేరుకుని దత్తుల వారి దర్శనం కోసం వెళ్లినప్పుడు ఆయన మగువతో కలిసి మద్యాన్ని పానం చేస్తూ కనిపించారు. ఇలా ఎన్ని పరీక్షలు ఎదురయినా దేవేంద్రుడు ఆయన్ని విడువక సేవిస్తూనే వున్నాడు. కొన్ని రోజులకి ఇంద్రుని భక్తికి ప్రసన్నుడైన దత్త ప్రభువు తన నిజ రూపంలో దర్శనమిచ్చి జంభాసురుని సహ్యాద్రికి వచ్చేలా చెయ్యమని చెప్తాడు. ఇంద్రుడు జంభాసురుని కవ్వించి అతన్ని సహ్యాద్రికి వచ్చేలా చేస్తాడు. జంభాసురుడు తన సైన్యంతో సహా సహ్యాద్రికి రాగానే వాళ్లకి మహాసౌందర్యవతియైన అనఘా దేవి కనిపిస్తుంది. ఆమె సౌందర్యానికి మోహితులై యుద్ధాన్ని చేయడం మాని ఆమెను పల్లకీలో కూర్చోబెట్టారు. ఆమెను ముందుగా ఎవరు పొందాలని వారిలో వారు కలహించుకుంటున్నప్పుడు దత్తప్రభువు ఇంద్రున్ని పిలిచి రాక్షసులను ఓడించడానికి ఇదే సరైన సమయం అని తెలియజేస్తాడు. అప్పుడు ఇంద్రుడు వారిని సునాయాసంగా ఓడిస్తాడు. అలా ఇంద్రుడు దత్త ప్రభువుల కృపకు పాత్రుడై తన రాజ్యాన్ని తిరిగి పొందాడు అని పై వృత్తాంతాన్ని గర్గముని, కార్తవీరునికి తెలియజేస్తారు.

కార్తవీరార్జునుడు సహ్యాద్రి చేరి దత్తప్రభువుని దర్శించి, భక్తి శ్రద్ధలతో వారిని సేవించిన తర్వాత కొంతకాలానికి ఆయన ప్రసన్నులై అతని వైకల్యాన్ని నివారించారు. అంతేగాక అతనికి వేయి బాహువులను, ఇతరుల మనసులను గ్రహించే శక్తిని అనుగ్రహించి, తనంత వాడి చేతిలో మరణం పొందే వరాన్ని ఇచ్చారు. దత్త ప్రభువు అనుగ్రహ బలం చేత కార్తవీరార్జునుడు రావణాసురుడ్ని యుద్ధంలో ఓడించాడు. అలా చాలా కాలం రాజ్య పాలన చేసిన తర్వాత రాజ్యభోగాల పట్ల విసుగు చెంది సత్యాన్ని తెలుసుకోవాలనే కోరిక తీవ్రంగా కలిగి దత్త ప్రభువుని ఆశ్రయించాడు. లౌకిక శాస్త్రాలు విషయాల పట్ల ఆసక్తిని పెంచుతున్నాయి, తత్త్వ శాస్త్రానికి పండితులు తెలియజేసే అర్ధాలు పరస్పర విరుద్ధంగా వుండి సాధకులను గందరగోళానికి గురిచేస్తున్నాయి అని దత్త ప్రభువుతో చెప్పగా. దత్త ప్రభువు "కార్త వీర్యా ! కొన్ని అర్ధాల్లో బాహ్యంగా బేధాలు కనిపించినా, అవి ఒకే తత్త్వాన్ని భిన్నమైన కోణాల్లోంచి ప్రతిపాదించిన సూత్ర పరిశీలనలు మాత్రమే. ఉత్తమమైనది తత్త్వ శాస్త్రమే. అలా అని ఇతర శాస్త్రాలు లౌకికములు అని వాటిని నిరసించరాదు. శాస్త్రాలన్నీ మంచి మార్గానికి దారి చూపేవే. వాటి ద్వారా కూడా ముక్తి సాధించవచ్చు." అని చెప్పారు. ఆ తర్వాత అతనికి నిర్వికల్ప సమాధి స్థితి కలుగజేసి, ఆత్మ తత్త్వం విచారణ చేసే పద్ధతులను తెలియజేసి అతన్ని ఆశీర్వదించారు. చివరికి కార్త వీరార్జునుడు తాను పొందిన వరం వల్ల పరశురామ అవతారంగా వచ్చిన భగవంతుని చేతిలో మరణాన్ని పొందాడు.


ఙ్ఞానబోధ :
----------

**దత్తాత్రేయుల వారు అలర్కునికి, ప్రహ్లాదునికి, పరశురామునికి ఙ్ఞానబోధ చేసారు.

షోడశ అవతారాలు :
-------------------
1.యోగిరాజు 2.అత్రివరదుడు 3.శ్రీ దత్తాత్రేయుడు 4.కాలాగ్ని శమనుడు 5.యోగిజన వల్లభుడు 6.శ్రీ లీలా విశ్వంభరుడు 7.సిద్ధరాజు 8.ఙ్ఞాన సాగరుడు 9.విశ్వంభరావధూత 10.శ్రీ అవధూత 11.మాయాముక్తావధూత 12.ఆది గురువు 13.శివరూపుడు 14.శ్రీ దేవదేవ 15.దిగంబరుడు 16.శ్రీకృష్ణ శ్యామకమలనయనుడు.

**శ్రీ దత్తాత్రేయ సంప్రదాయంలో కలియుగానికి ముందు స్వామికి పదహారు అవతారాలని చెప్పబడింది.ఆయన పరతత్త్వంతో నిత్యం భూలోక నివాసం చేస్తాడు గనుక మహర్షులకు ఆయన ప్రసాదించిన సగుణ సాక్షాత్కారాలనే ఆయన అవతారాలని కీర్తించారని మనం గమనించాలి.

ఈ దత్తప్రభువు మానవజాతి నిలిచివున్నంతవరకూ గురురూపంలో మానవాళిని ఉద్ధరించడమే తన కార్యంగా చేసుకుని, వివిధ గురుసంప్రదాయాల ద్వారా అన్నిమతాల్లో, ప్రతియుగంలో 1,25,000 మంది అవధూతలు, మహాత్ముల రూపంలో ఈ భూమిపై తన కార్యం నిర్వహిస్తూవుంటారు. అట్టి గురుపరంపరలో భాగంగా, కలియుగంలో ఆంధ్రదేశంలోని తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరానికి దగ్గరగా ఉన్న శ్రీ పీఠికాపురం (పిఠాపురం) అనే గ్రామంలో శ్రీపాద శ్రీవల్లభులుగా దత్తప్రభువు తన ప్రపధమ అవతారాన్ని ప్రకటించారు.

శ్లో II కృతే జనార్ధనో దేవః
త్రేతాయాం రఘునందనః
ద్వాపరే రామకృష్ణాచ
కలౌ శ్రీపాద వల్లభః

తా II కృత యుగములో జనార్ధనుడు,త్రేతా యుగములో రాముడు,ద్వాపర యుగములోకృష్ణుడు,కలి యుగములో శ్రీపాద శ్రీవల్లభుడు అవతార పురుషులని ఆది గురువు వేదవ్యాస మహర్షి తమ భవిష్యపురాణంలో తెలియజేసారు.
 
 శ్రీపాద శ్రీవల్లభుల అవతారం : 
మానవులను తరింపజేయదలచిన భగవంతుడు, వారికి ధర్మ మార్గం పై ఆసక్తి కలుగజేయడానికి ధర్మాన్ని ముందు తానే ఆచరించి చూపాలి కనుక, మానవరూపంలో భూమిపై అవతరిస్తాడు.ఈ కలియుగంలో కూడా అలాగే పవిత్ర గోదావరీ తీర సమీపంలో పిఠాపురం అనే గ్రామంలో ఆయన అప్పలరాజు శర్మ, సుమతి మాత అనే పుణ్యదంపతులకు శ్రీపాద శ్రీవల్లభునిగా 1330 వ సం|| భాద్రపద శుక్ల చతుర్ధినాడు ఉదయం శుభముహూర్తంలో జన్మించారు.

ఈ దంపతులకు మొదట కొంత మంది పిల్లలు పుట్టి చనిపోయారు.వీరు నిత్యమూ భిక్షకై వచ్చేవారిని శ్రీదత్త రూపాలుగా భావించి భిక్ష సమర్పించేవారు. ఒక అమావాశ్యనాడు వారింట్లో బ్రాహ్మణులను పిలిచి శ్రాద్ధకర్మ ప్రారంభించారు.కానీ ఆనాడు బ్రాహ్మణులకు భోజనం వడ్డించకముందే వారింటికి దండకమండలములు ధరించిన సన్యాసి వచ్చి భిక్ష కోరాడు. శ్రాద్ధ కలాపంలో ఉన్న ఆమె భర్తకు ఈ విషయం తెలియదు. వచ్చిన భిక్షువు శ్రాద్ధ భోక్తయైన పరమేశ్వరుడేనని తలచి ఆయనకు భిక్ష ఇచ్చింది. ఆమె భక్తి విశ్వాసాలకు సంప్రీతుడైన ఆ యతీంద్రుడు యదార్ధమైన తన దత్తాత్రేయ రూపంలో దర్శనమిచ్చి - "తల్లీ నీ అచంచలమైన విశ్వాసానికి సంప్రీతుడనయ్యాను, " శ్రాద్ధ బ్రాహ్మణులు భోజనం చెయ్యకమునుపే నేను పరమేశ్వరుడినన్న విశ్వాసంతో భోజనం పెట్టావు. నీ అభీష్టమేమిటో చెప్పు. నేను తప్పక నెరవేర్చగలను అన్నాడు." అప్పుడు సుమతీ మాత "పరమాత్మా నీవు భక్తుల కోరికలీడేర్చే కల్పవృక్షానివి. నీవు నన్ను తల్లీ అని సంబోధించావు. కనుక నేను ప్రత్యేకంగా వరమడుగవలసిన పనిలేదు. నీవిచ్చిన మాట నిలుపుకోచాలు అన్నది."

భక్తిశ్రద్ధల వలన జాగృతమైన ఆమె బుద్ధిశక్తికి ఆశ్చర్యచకితుడైన స్వామి - "అమ్మా నాతో సమానమైన పుత్రుడే నీకు జన్మిస్తాడు, కానీ నువ్వు చెప్పినట్లే అతను చెయ్యాలని నువ్వు నిర్బంధించకూడదు. అతడు చెప్పినదే అక్షరాలా అమలుజరపాలి. " అప్పుడు మాత "స్వామి నేను మానవమాత్రురాలిని పుత్రవ్యామోహం కలుగడం సహజం, కనుక సమయానుకులంగా అట్టి వివేకాన్ని నీవే కలుగజేయాలి అన్నది. " ఆమె సమయస్ఫూర్తికి మెచ్చి స్వామి నవ్వి, ఆశీర్వదించి అంతర్హితులయ్యరు.

ఆ విధంగా ఆ పుణ్యదంపతులకు జన్మించిన శ్రీపాద వల్లభులు 16 సంIIల ప్రాయం వరకూ పిఠాపురంలో వుండి, అటు తర్వాత సన్యసించి పాదచారియై ద్వారక, కాశీ, బృందావనం మొ|| క్షేత్రాలు దర్శిస్తూ బదరీ వెళ్లి, అటు తర్వాత గోకర్ణం వెళ్లారు.అక్కడ మూడు సంవత్సరాలుండి ఆ క్షేత్రమహాత్మ్యాన్ని పునరుద్ధరించి తర్వాత కృష్ణాతీరంలోని కురువపురానికి వెళ్లి అక్కడ 14 సంవత్సరాలు తపస్సు చేసి అక్కడే తమ స్థూలరూపాన్ని మరుగుపరచారు.

రవిదాసు కథ :
--------------
కురువపురంలో రవిదాసు అను రజకుడు స్వామివారిని నిత్యం సేవిస్తూవుండేవాడు. స్వామి నదీ స్నానానికి వచ్చినప్పుడల్లా దారిలో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తుండేవాడు. అతని భక్తిశ్రద్ధలకు మెచ్చిన స్వామి ఒకనాడు నాయనా నీవు నిత్యం భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తున్నావు, నీ సేవ వలన మాకు సంతోషమైంది అన్నారు. నాటి నుండి అతనికి సంసారచింత నశించి మరింత భక్తిశ్రద్ధలతో స్వామిని సేవించసాగాడు. ప్రతిరోజూ అతడు స్వామియొక్క ఆశ్రమ ప్రాంగణమంతా శుభ్రంగా చిమ్మి నీళ్లు చల్లుతుండేవాడు. అటు తర్వాతనే తన కులవృత్తి చేసుకోవడానికి వెళ్తుండేవాడు.

ఒకనాడు రవిదాసు తన కులవృత్తి చేసుకోవడానికి నదీ తీరానికి వెళ్లినప్పుడు అక్కడ సుందరయువతీ జనంతో కలిసి విహారార్ధమై నదికి వచ్చిన ఒక యవనరాజును, అతని వెంట వైభవంగా తరలివచ్చిన పరివారాన్నీ చూచాడు. ఆ దృశ్యాన్ని చూచి సమ్మోహితుడై, తాను నిరంతరం చేసుకొనే శ్రీపాదుల వారి నామస్మరణ మరచి, తన్మయుడై కొంతసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ వుండిపోయాడు. తర్వాత అతడు మానవజన్మమెత్తాక ఇటువంటి వైభవము, సుఖము అనుభవించకపోతే జీవితే వ్యర్ధం అనుకొన్నాడు. ఇంతలో మధ్యాహ్నం అయింది, శ్రీపాద స్వామి అనుష్టానానికి నదీ తీరానికి వచ్చారు. అతడు స్వామికి నమస్కరించి తాను సమ్మోహితుడై చూచిన దృశ్యం వివరించి, అయినా అఙ్ఞానం వల్ల అలా భ్రమించానేగానీ మీరున్న స్థితియే నిజమైన సౌఖ్యమివ్వగలదని ఇప్పుడు తోస్తున్నది అన్నాడు.

నాయనా నీవు పుట్టినది మొదలు కష్టం చేసుకొనే జీవిస్తున్నావు అందుకనే నీవు అతనిని చూడగానే నీకు రాజ్యభోగాలపై ప్రీతి కలుగడంలో ఆశ్చర్యమేమీ లేదు, నాయనా నీవు రాజువు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నావు కదా! నిస్సంకోచంగా చెప్పు అన్నారు.
దానికి రవిదాసు వెంటనే స్వామి! నా అఙ్ఞానం మన్నించి నన్ను మన్నించి అనుగ్రహించు అని వేడుకున్నాడు. నాయనా మనసులో బలంగా కలిగిన సంకల్పం నెరవేరవలసిందే, ఇలాటి కోరికలు తమోగుణం వలన కలుగుతాయి.అవి కలిగాక ఇంద్రియాలను, మనస్సును తృప్తి పరుచుకోవాలి . లేకుంటే యిలాటి వాసనలు మిగిలివున్నంత వరకూ మళ్లీ మళ్లీ జన్మిస్తుండవలసిందే, నీకు ఆ రాజసౌఖ్యాలు ఈ జన్మలోనే కావాలా? లేక మరుజన్మలో కావాలా? సంకోచించకుండా చెప్పు! అన్నారు. అప్పుడతడు నాకిప్పుడూ వయసయిపోయింది, ఈ జన్మలో ఇంతటి సుఖం లభించినా నేను తృప్తిగా దాన్ని అనుభవించలేను. కనుక నాకవి మరుజన్మలో లభిస్తే వాటిని ఆజన్మాంతమూ అనుభవించగలను అన్నాడు. నీలో రాజ్యకాంక్ష, సుఖలాలస బలీయంగా ఉన్నాయి కనుక నీవు మరుజన్మలో మృధుర దేశంలో యవనరాజ వంశంలో జన్మిస్తావు అన్నారు. స్వామీ మీరిచ్చిన వరం నాకు ప్రీతికరమైనదే కానీ మరుజన్మలో నాకు రాజ్యం లభించినా నన్ను మీకు దూరం చెయ్యవద్దు. మీయందు దృఢభక్తి ఉండేలా అనుగ్రహించండి. అప్పుడూ నాకు మతద్వేషం ఉండకూడదు అన్నాడు. అప్పుడు శ్రీపాద స్వామి ఇప్పుడు నీవెట్టి వైభవం చూచావో అట్టిదే మరుజన్మలో పొందుతావు. అప్పుడు మేమవతరించవలసిన అవసరమొస్తుంది. వృద్ధాప్యంలో నీకు మా దర్శనమవుతుంది, తక్షణమే నీకు ఙ్ఞానోదయం అవుతుంది. భయంలేదు నీవికవెళ్లి రావచ్చు అని ఆశీర్వదించి, ఒక వింతైన నవ్వుతో అతనివైపు చూచారు. ఆ రజకుడు అక్కడిక్కడే మరణించాడు.

తిరుమలదాసు కథ :
--------------------
రవిదాసు తండ్రి తిరుమలదాసు, అతడు శ్రీపాద వల్లభుని అవతారంలో ఉన్న దత్తప్రభువుకి చేసిన సేవకి, అతన్ని శిరిడీ సాయి అవతారంలో వచ్చినప్పుడు అనుగ్రహిస్తానని ఆశీర్వదించారు.ఈ వాక్కు ఎలా ఫలించిందో చూద్దాం. ఆచార్య ఎక్కిరాలభరద్వాజ గార్కి బాబాగార్ని ప్రత్యక్షంగా సేవించుకున్న దామోదర్‌ రాస్నే కుమారుడు నానాసాహెబ్ రాస్నేగారు ఈ వృత్తాంతం ఇలా చెప్పారు - నానాసాహెబ్ రాస్నేగారు శ్రీగాడ్గీ మహరాజ్ గారికి ఒకరోజు తన ఇంట ఆతిధ్యం ఇచ్చి వారి గురుసేవ గురించి అడిగినప్పుడు ఇలా చెప్పరట - సాధారణంగా మా వృత్తాంతం మేమెవరికీ తెలుపము.మా తల్లిదండ్రులు రజకులు. శేవ్గాఁవ్ పతర్దీ అనే ఊళ్లో ఒక బట్టల దుకాణంలో పనిచేసేవాణ్ణి. ఒకరోజు దివ్యవర్ఛస్సు గల ఫకీరొకరు మా గ్రామానికి వచ్చారు, అయన ముస్లీం అన్న భావంతో ఎవరూ ఆయనకు భిక్ష వెయ్యలేదు. మా దుకాణంలో కూడా యజమాని అతన్ని భిక్ష ఇవ్వకుండా కసురుకున్నాడు. నాకు ఆయన్ని చూడగానే భిక్ష వెయ్యలనిపించి, పరుగున పోయి రొట్టెలు, కూర తెచ్చేసరికి ఆయన వెళ్లిపోయారు.నేను ఆయనను వెతుకుతూ పోయేసరికి ఒక ఏకాంత ప్రదేశంలో జొన్నకంకులు కోసుకుని తింటూ కనిపించారు. నన్ను చూచి కోపంతో నీవిక్కడికెందుకొచ్చావ్? అని గర్జించారు.

గాడ్గీ మహరాజ్ : మీకెవరూ భిక్షవేయలేదని గమనించి ఇంటి నుండి భిక్ష తెచ్చాను అన్నాను.
ఫకీర్ : ఓహో! నేనేమి కోరితే అదిస్తావా? ఏం అన్నారు.
గాడ్గీ మహరాజ్ : నా దగ్గరలేని డబ్బు తప్ప మీరేమి కోరినా ఇస్తాను అన్నాను,
ఫకీర్ : అయితే నీ ప్రాణమివ్వు అన్నారు పంతంగా.
గాడ్గీ మహరాజ్ : అది నేనివ్వగలిగింది కాదు. మిరే తీసుకోండి. నాకీ జీవితమంటే విరక్తి పుట్టింది అన్నాను.

ఆ ఫకీరు నవ్వి నా తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు. వెంటనే నా హృదయంలో చెప్పలేని మార్పు వచ్చింది. వారి సన్నిధి తప్ప మరేమీ కావాలన్పించలేదు.వారికి భిక్ష ఇచ్చాక ఇంటికి వెళ్లి, నాకొక గొప్ప గురువు దొరికారని నేనిక సంసారంలో జీవించలేనని చెప్పి వేగంగా ఫకీరు వద్దకు చేరుకున్నాను.ఆయన నన్ను చూస్తూనే ఉగ్రులై దుష్టుడా ఇచ్చింది చాలలేదా ఇంకా పీడించుకు తినాలని వచ్చావే? అని గద్దించి పక్కనున్న శ్మశానంలోకి వెళ్లారు.నేను మిమ్మల్ని విడిచి బ్రతకలేను అంటూ వారిని అనుసరించాను.అక్కొడక సమాధి పక్కన గుంట త్రవ్వి.అందులో రెండు కుండలు నీరు పోయమన్నారు,నేను అలానే చేసాను. ఆయన ఆ నీరు మూడు దోసిళ్లు తాగి నన్నూ తాగమన్నారు.అవి తాగగానే నాకు చాలా సేపు బాహ్య స్మృతి లేకుండాపోయింది.నాకు స్పృహ వచ్చే సరికి ఆయన ఎటో వెళ్లిపోయారు.నేను ఆయనకోసం చాలాకాలం వెదకి చివరకు శిరిడీలోని మసీదుకు చేరాను. లోపల తెరలు దించివున్నాయి.అక్కడ ఫకీరు స్నాం చేస్తున్నారు. నేను తెర పైకెత్తి చూచాను. నన్ననుగ్రహించిన ఫకీరే ఆయన! నన్ను చూస్తూనే పట్టరాని కోపంతో ఆయన "లంజకొడకా! ఇప్పటికే నా రక్తమాంసాలు పీక్కుతున్నావ్, ఎముకలు కూడా తినాలని వచ్చావట్రా?"అని ఒక ఇటుకరాయి విసిరారు.అది నా నొసట తగిలి నెత్తురుకారింది. మరుక్షణమే ఆయన ప్రేమగా నిన్ను పూర్ణంగా అనుగ్రహించాను.భగవంతుని అనుగ్రహం నీకెప్పుడూ ఉంటుంది,నిన్నందరూ దైవంగా కొలుస్తారు. ఇక నా వెంట తిరుగవద్దు అన్నారు.కొంతకాలానికి ఆయనే గాడ్గీ మహరాజ్గా ప్రసిద్ధిచెందారు, లోకపూజ్యులై ఎన్నో ధర్మశాలలు, పాఠశాలలు స్థాపించారు. వీరు సంకీర్తన చేస్తుంటే వేలాది మంది భక్తులు చేరేవారు.

శివశర్మ - అంబిక వృత్తాంతం :
-----------------------------
కురువపురంలో శివశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు, అతని భార్య అంబిక మహాపతివ్రత. పూర్వకర్మ వలన వారికెంతో మంది పిల్లలు పుట్టి కొద్దికాలంలోనే చనిపోతుండేవారు. చివరికి ఒక కొడుకుమాత్రం నిలిచాడు. దురదృష్టవశాత్తు ఆ బిడ్డ జడుడు, మూఢుడు, మందబుద్ధి గలవాడయ్యడు. నిష్ప్రయోజనమైన సంతానం వల్ల కలిగిన దిగులుతో అతను చిక్కిశల్యం అవసాగాడు. శ్రీపాదుల వారి సమక్షంలో ఒకనాడు వేదం పఠించిన అతను మౌనంగా నిలుచున్నాడు, అతని దిగులుకు కారణమేమిటని అడిగిన స్వామికి తన కుమారుని వృత్తాంతం వివరించాడు. ఇది పూర్వకర్మ ఫలితమేనని చెప్పి నీ కుమారుడు ఉద్ధరింపబడాలంటే వాని పూర్వజన్మ పాపమును మొదట హరించాలి. అప్పుడే అతను పాండిత్యానికి అర్హత పొందగలడని, నీవు నీ జన్మను త్యాగం చేసినచో నీ బిడ్డని యోగ్యుడైన పండితుని చేయగలనని స్వామి పలికారు.అందుకు ఆ పండితుడు నా బిడ్డడి కోసం నేను శరీరం త్యజించడానికి సంసిద్ధుడననే అని పలికాడు.

కొంతకాలం తర్వాత శివశర్మ మరణించాడు. అంబిక తన కొడుకుతో బిచ్చమెత్తుకుని జీవించసాగింది. ఆ బాలుణ్ని గ్రామస్తులు అవహేళన చెయ్యడం, చులకనగా మాట్లాడటం చేస్తుండేవారు. ఆ పరిహాసాలు రోజురోజుకి ఎక్కువవడంతో వాటిని భరించలేక ఆ బాలుడు
ఆత్మహత్య చేసుకోవడానికి పరుగెత్తసాగాడు. అతనిని వారించగల శక్తిని కోల్పోయిన అతని తల్లికూడా నిస్సహాయురాలై, తను కూడా ఆత్మాహత్య చేసుకోడానికి పరుగెత్తసాగింది. దారిలో వారికి శ్రీపాద స్వామి ఎదురై బ్రాహ్మణుడా తొందరపడవద్దు. పూర్వకర్మ వల్ల నీకీ దుస్థితి దాపురించింది. దీనికితోడూ నీవిప్పుడు బలవంతంగా మరణిస్తే నీకు బ్రాహ్మణ హత్య, ఆత్మహత్యా దోషాలు చుట్టుకుంటాయి. అవి నివారింపరానివి. అందువల్ల జీవించి కష్టాలను ఓర్పుతో అనుభవించి దుష్కర్మల శాశ్వతంగా విముక్తుడవటం మంచిది అన్నారు.

అందుకు అంబిక స్వామీ, ఒక వంక భర్తను కోల్పోయి, మరొకవంక వ్యర్ధుడైన ఈ పుత్రుని వల్ల ఎలాంటి సద్గతులు నేను పొందగలను?నన్ను చూడటమే మహాపాపంగా లోకులు పరిగణిస్తున్నారు. మేమిక బ్రతికి చెయ్యగలిగేదేముంది అన్నది. ఆత్మహత్య వల్ల మరొక పాపం చుట్టుకుంటుందని తెలియజేసి - నీ మిగిలిన జీవితమంతా శివపూజలోనే గడుపు, అలా చేస్తే నావంటి కుమారున్ని పొందగలవు అన్నారు. మీరు చెప్పినట్లే చేస్తాను కానీ దాని వల్ల ప్రయోజనమేమిటో నాకర్ధం కాలేదు దయచేసి వివరించండి అన్నది.అప్పుడామెకు శివపూజ వల్ల యశోద ఎలా కృష్ణునికి తల్లి కాగలిగిందో తెలిపి, శివపూజ మహిమ వల్ల నీవుకూడా అలాగే అవుతావు అన్నారు. స్వామీ శివపూజ వలన కలిగే ఫలితం వచ్చే జన్మలో కదా!? ఈ జీవితశేషం నేనెలా గడపాలి? మహానుభావా అందరి పరిహాసాలకు గురవుతున్న నా బిడ్డడు ఏ క్షణాన మరణిస్తాడో తెలియదు, నన్ను మాతృత్వంతో రక్షించు అని వేడుకున్నది.ఆ కరుణాసముద్రుడి హృదయం కరిగి తన చేతిని ఆ బాలుని తలపై పెట్టి ప్రణవముచ్చరించారు. ఆ మూర్ఖ బాలుడు తక్షణమే బృహస్పతి అంతటి ఙ్ఞానీ, వక్తా అయ్యాడు.

వల్లభేశుని వృత్తాంతం :
----------------------
వల్లభేశుడనేవాడు పేద బ్రాహ్మణుడు. ఇతనికి శ్రీపాద స్వామి ఆశీర్వాదంతో వివాహం జరిగింది. ప్రతి సంవత్సరం నియమంగా స్వామి వారిని దర్శించి సేవించుకొనేవాడు. కొంతకాలానికి స్వామివారు తమ అవతారాన్ని చాలించారు. ఆ తర్వాత ఇతడు పసుపు వ్యాపారం ప్రారంభించి, కురువపురం వచ్చి స్వామివారి పాదుకలను దర్శించుకొని వ్యాపారం వృద్ధిలోకి వస్తే వేయి మంది బ్రాహ్మలకి భోజనం సమారాధన చేస్తానని మొక్కుకున్నాడు. అప్పటి నుండి అతని వ్యాపారం క్రమంగా అభివృద్ధి చెంది మంచి లాభాల్ని ఆర్జించాడు. తన కోరిక నెరవేరడంతో స్వామి వారికిచ్చిన మాట ప్రకారం తన మొక్కు చెల్లించడానికి కావల్సినంత డబ్బు తీసుకుని కురువపురం బయలుదేరాడు. మార్గమధ్యంలో అతనికి నలుగురు అపరిచితులు అతనికి పరిచయమయి తాము స్వామి వారి భక్తులమేనని ప్రతి సంవత్సరం యాత్ర చేస్తామాని చెప్పారు. వారు యాత్రికుల రూపంలో వున్న దొంగలని గ్రహించేంత దూరదృష్టి వల్లభేశునికి లేకపోవడంతో వారి మాటలు నమ్మి వారితో కలసి ప్రయాణించసాగాడు.

మార్గమధ్యంలో ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి రాగానే ఆ దొంగలు వల్లభేశుని తల నరికి చంపి, అతని దగ్గరున్న ధనం అపహరించారు. ఈ దుర్ఘటన ఎవరూ పసిగట్టకూడదని తలచి అతని శవాన్ని దహనం చేయడానికి ప్రయత్నించసాగారు. ఐతే వల్లభేశుడు మరణించే ముందు చివరి క్షణాల్లో "శ్రీ పాద వల్లభా" అని కేక పెట్టాడు. అందువల్ల భక్తరక్షకూడైన శ్రీపాద స్వామి జడలు, భస్మము, త్రిశూలమూ ధరించిన యతి రూపంలో ప్రత్యక్షమయి త్రిశూలంతో ఆ దొంగలను సంహరించారు. వారిలో ఒకడు మాత్రం ఆయన పాదాలపై పడి తనకే పాపమూ తెలియదని, తెలియక వారితో కలిసానని చెప్పి తెలియక చేసిన తప్పిదాన్ని మన్నించమని శరణు వేడతాడు. సర్వసాక్షియైన స్వామి అతన్ని మన్నించి కొంచెం విభూతి ప్రసాదించి దానిని వల్లభేశుని శరీరం పై చల్లి తెగిపడివున్న తలని అతని మొండానికి అతికించమని ఆదేశించారు. అతను ఆ పని చేస్తుండగా శ్రీపాద స్వామి వల్లభేశుని పై తమ కృపాదృష్టిని సారించి వెంటనే అంతర్ధానమయ్యారు. వల్లభేశుడు తిరిగి బ్రతికాడు.

అతనికి జరిగిందేమీ గుర్తులేదు.తనతో వచ్చిన అపరిచితులు చచ్చిపడివుండటం చూచి, పక్కనున్న అతన్ని "వీళ్లందరూ ఎలా మరణించారు? నువ్వొక్కడ్డివే ఎలా బ్రతికావు?" అని అడిగాడు. అప్పుడతడు, "అయ్యా ! ఇప్పుడొక అద్భుతమైన దైవలీల జరిగింది. మనతోపాటు వచ్చిన వారు దొంగలు, వాళ్లు నిన్ను చంపి నీ ధనమపహరించారు. ఇంతలో ఒక యతి వచ్చి ఈ దొంగలను చంపి మిమ్మల్ని బ్రతికించారు అంటూ జరిగిన వృత్తాంతం వివరించాడు. తనని రక్షించినది సాక్షాత్తూ శ్రీపాద వల్లభ స్వామేనని గ్రహించిన వల్లభేషుడు ఎంతో పరితపించాడు. అయినా తనని పునరుజ్జీవుతుణ్ని చేసినందుకు సంతోషించి కురువపురం చేరి స్వామి పాదుకలను సకల ఉపచారాలతో పూజించాడు. ముందు తాను మొక్కుకున్నట్లు వేయిమందికి కాక, నాలుగువేల మంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇచ్చి వారిని సత్కరించాడు.

నిర్యాణం :
----------
శ్రీ పాద వలభ స్వామి 1950, హస్తా నక్షత్రము, ఆశ్వయుజ కృష్ణ ద్వాదశి రోజున తన భక్తుడైన శంకరభట్టుకి తమ రూపాన్ని గుప్త పరచవలసిన సమయం ఆసన్నమైందని తెలియజేసి, తన చరితామృతాన్ని రచించి మూడ సంవత్సరాల తర్వాత తమ పాదుకల వద్ద వినిపించమని తెలియజేసారు. ఆ తర్వాత కురువపురం వద్ద కృష్ణానదిలో మునిగి అంతర్హితులయ్యారు.
 
 
శ్రీ నృసింహ సరస్వతి అవతారం :

శ్రీపాద స్వామి ఆదేశించినట్లు అంబిక శేషజీవితమంతా శివపూజలో గడిపింది. మరుజన్మలో ఆమె మహారాష్ట్రలోని కారంజా గ్రామంలో (అకోలా జిల్లా) ఒక సద్బ్రాహ్మణుని కుమార్తెగా జన్మించింది. తల్లిదండ్రులామెకు అంబ అని నామకరణం చేసారు. యుక్తవయస్సు రాగానే మాధవశర్మ అనే బ్రాహ్మణోత్తమునికిచ్చి వివాహం చేసారు.పూర్వ జన్మ సంస్కారానికి తోడు, ఈ జన్మలో భర్త సాంగత్యం వల్ల ప్రతిదినమూ సంధ్యా సమయంలో శివపూజ, భర్తతో కలిసి శనిప్రదోష పూజ, శని త్రయోదశీనాడు విశేషమైన పూజ చేసేది. ఇలా 16 సంవత్సరాలు గడిచాక అంబ గర్భవతియైంది. ఆమెకు 1376 వ సంవత్సరంలో సాక్షాత్తూ దత్తాత్రేయుల వారికి జన్మనిచ్చింది. పుట్టినబిడ్డ అందరిలా ఏడ్వలేదు సరికదా స్పష్టంగా ప్రణవం ఉచ్ఛరించాడు. ఒక శుభముహూర్తంలో అతనికి శాలగ్రామ దేవ అని నామకరణం చేసారు. కాని ఇంట్లో అందరూ అతన్ని నరహరి అని పిలుచుకొనేవారు. అంబ వద్ద పిల్లవానికి చాలినన్ని పాలులేవు తల్లి బలహీనంగా ఉండటంతో దాదినిగాని, పాడిగేదెను గాని ఏర్పాటుచెయ్యాలని దంపతులు ఆలోచిస్తుండగా, ఆ పిల్లవాడు ఒకనాడు తన తల్లి వక్షస్థలాన్ని చేతులతో స్పృశించాడు, వెంటనే ఆమెకు స్తన్యం పెల్లుబికి 32 ధారలుగా కారి నేలపైబడ్డాయి. అయన లీలల్ని తల్లి రహస్యంగా ఉంచడంతో, ప్రభువు యొక్క సంపూర్ణ దివ్యత్వం ఎవరికీ తెలియరాలేదు.

ఇలా సంవత్సరం గడిచింది, ఆ బిడ్డకి ఒక్కమాటా రాలేదు. పిల్లవాడికి ఫలాన విధంగా చేస్తే మాటలొస్తాయని ఎవరేది చెప్తే ఆ తల్లి తూ.చ తప్పక వాటన్నిటిని చేసింది.ఎవరేది అడిగినా ఓం అన్నదే ఆ పిల్లవాడి సమాధానం.తల్లిదండ్ర్లు దిగులుపడసాగారు. వారి బాధని చూడలేని ప్రభువు ఒక ఇనుపముక్కని ఇమ్మని సైగ చేసి దాన్ని తన చేతితో తాకాడు అది బంగారంగా మారింది. వారు ఆశ్చర్యచకితులవ్వగా తనకు ఉపనయనం అయ్యాక మాట్లాడుతానని సైగల ద్వారా తెలియజేసాడు. కొంతకాలం తర్వాత ఉపనయనయం జరిపించాక భవతి బిక్షాందేహి అని భిక్ష కోరి మొదటతల్లితోనే మాట్లాడాడు. క్రతువు పూర్తి అయ్యే సమయంలో తల్లి ఆయనతో నాయనా నీవిక భిక్షతోనే జీవించాలి అన్నది. అమ్మా మీ ఆఙ్ఞ ప్రకారం భిక్షువునవుతానని, సన్యాసం స్వీకరించడానికి అనుమతినివ్వమని కోరాడు. తల్లి దుఃఖితురాలవడం చూచి మరిద్దరు బిడ్డలు కలిగాక సన్యసిస్తానని తెలియజేసి. తల్లిదండ్రులకి ఇద్దరు బిడ్డలు పుట్టేవరకు వారితోనే ఉండి, వారు పుట్టిన తర్వాత తన తల్లికి పూర్వజన్మ వృత్తాంతం తెలియజేసి - తల్లి అనుమతితో సన్యసించారు.

అటు తర్వాత ఆయన పాదచారియై తీర్ధక్షేత్రాలు సందర్శిస్తూ, కాశీ చేరారు. అక్కడ తీవ్రమైన తపస్సు చేస్తుండగా ఆయనకు వృద్ధుడైన కృష్ణ సరస్వతి రోజు ఆయనకు భక్తితో నమస్కరిస్తూ, తన శిష్యులను కూడా అయనకు నమస్కరించమనేవారు. ఒకనాడు వారి శిష్యుల కోరిక మేరకే శ్రీ ఆదిశంకరుల వారు స్తాపించిన సన్యాసమార్గాన్ని పునరుద్ధరించడానికి తానే గురువైనప్పటికీ లోకులకు గురుసంప్రదాయం గొప్పతనం తెలియజేయడానికి శ్రీ కృష్ణ సరస్వతి గారి వద్ద శిష్యత్వం స్వీకరించి, గురువిచ్చిన దీక్షానామంతో శ్రీ నృసింహ సరస్వతి అయ్యారు.

నరహరిశర్మ అనుభవం :
-----------------------
శ్రీ నృసింహ సరస్వతీ స్వామి గంధర్వపురంలో నివశిస్తున్నప్పుడు ఒకరోజు నరహరిశర్మ అనే కుష్టురోగి ఆయన దర్శనానికి వచ్చాడు. అతడు స్వామికి వినయపూర్వకంగా నమస్కరించి ఇలా మనవి చేసుకున్నాడు, "స్వామి మీరు కలియుగంలో వెలసిన దత్తావతారం అని, స్మరించినంత మాత్రానే భక్తులను రక్షిస్తారని విని మిమ్మల్ని ఆశ్రయించి వచ్చాను. కుష్టు వ్యాధి రావడం వల్ల నా జీవితం దుఃఖభరితమైంది. వేదం అభ్యసించినప్పటికీ నన్నెవరు ఆదరించడం లేదు. ఈ వ్యాధి వలన అందరూ నన్ను వెలివేసారు, మాట్లాడటం లేదు సరికదా ఎవరికైన ఎదురుపడితే మొహం తిప్పుకుంటున్నారు. అందరికీ జుగుప్స గొలుపుతూ బ్రతికి ఉండటం కన్నా చచ్చిపోవడమే మేలనిపించింది. గత జన్మల పాపాలే నన్నిలా బాధిస్తున్నాయి. ఈ వ్యాధిని తొలగించుకోడానికి నేను కలవని వైద్యుడు లేడు, చెయ్యని వ్రతం లేదు, ఆశ్రయించని దేవత లేదు. దేని వలనా ప్రయోజనం కలుగక చివరికి మీ గురించి విని, ఇక్కడికి వచ్చాను. మీరే నన్నెలాగైనా ఉద్ధరించాలి. లేకపోతే మీ ఎదుటే నేను ప్రాణాలు విడుస్తాను" అని ఏడుస్తూ సాష్టాంగ నమస్కారం చేసాడు. అప్పుడు శ్రీ గురుడు అతనిని లెమ్మని చెప్పి, "విప్రుడా ! నీవు గతంలో చేసిన పాపాల వల్లే ఇప్పుడు ఈ వ్యాధి వచ్చింది. ఇది తొలగిపోవడానికి నేనొక ఉపాయం చెబుతాను. దాని వలన నువ్వు శుద్ధుడవై దివ్యమైన శరీరాన్ని పొందుతావు" అన్నారు.

ఇదే సమయంలో ఒక వ్యక్తి ఎండు కట్టెపుల్లల మోపు తీసుకుని అటుగా వెళ్తున్నాడు. శ్రీ స్వామి వారు ఆ వ్యక్తిని పిలిచి అతని మోపులో వున్న ఎండిన మేడి కట్టెనొకదాన్ని నరహరికి ఇప్పించారు. ఆ ఎండు పుల్లని చూపుతూ నాయనా "నీవు ఈ మేడి కట్టెని సంగమం దగ్గరున్న భీమేశ్వరాలయం దగ్గర నాటు. నిత్యమూ స్నానం చేసి రావి చెట్టుకు ప్రదక్షిణం చేసి, రెండు కుండలతో నీరు తెచ్చి మూడు పూటలా ఈ కట్టెకి పోస్తూ వుండు. ఈ మేడి కట్టె ఎప్పుడైతే చిగురిస్తుందో అప్పుడు నీ వ్యాధి నయం అవుతుంది, మా మాటపై దృఢ విశ్వాసం వుంచి మేము చెప్పినట్లే చేయి" అన్నారు. నరహరి స్వామి వారి పై నమ్మకముంచి ఆయన చెప్పినట్లే చేయసాగాడు. అతని దీక్షగా ఆ పని చేయడం గమనించిన వారందరూ అతన్ని చూచి నవ్వుతూ ’వెఱ్ఱి బ్రాహ్మడా ఎండిపోయిన కట్టెలెలా చిగురిస్తాయి? శ్రీ గురుడు నీ కోరిక నెరవేరదని తెలియజేయడానికే నిన్నీ పని చెయ్యమన్నారు. ఆలోచించి చూస్తే లోతైన ఈ అర్ధం స్ఫురించడం లేదా !" అంటూ అతన్ని నిరుత్సాహపరుస్తూ వున్నారు. ఇలా ఒక వారం రోజులు గడిచాయి, లోకులెంతగా నిరుత్సాహపరుస్తున్నా అతను పట్టు విడవకుండా "భువిలో అవతరించిన మహాత్ముల మాటలు నిత్య సత్యాలు, వారు సత్య సంకల్పులు వారు మాట మాత్రం చేత గొడ్డు బఱ్రె పాలు ఇచ్చింది, చనిపోయిన వారు తిరిగి బ్రతికారు అటువంటి ఆ సత్యం నా విషయంలో ఎందుకు నిరూపణకాదు !" అనే భావం కలిగి తనకప్పగించిన పనిని నియమం ప్రకారం చేస్తూనే వున్నాడు. విషయాల పట్ల అనవసరమైన ఆసక్తి కలిగిన కొందరు వ్యక్తులు అత్యుత్సాహంతో స్వామి వారి దగ్గరికి వెళ్లి "స్వామి ఆ వెఱ్రి బ్రాహ్మడు మీరు చెప్పినట్లే చేస్తున్నాడు, ఆ ఎండు కట్టెలో చిగురువేస్తున్న లక్షణాలేవీ కనిపించడంలేదు" అని చెప్పారు. అప్పుడు శ్రీ గురుడు వారితో నాయనలారా "ఈ భూ లోకంలో గురువు వాక్కు మాత్రమే ఎటువంటి వారినైనా తరింపజేయగలదు. గురువుని నమ్మిన వారికి కోరినవన్నీ సిద్ధిస్తాయి. గురువు చెప్పినట్లే సాధన చేసిన వారికి ఫలితం లభిస్తుంది. దేవత, మంత్రము, పుణ్యతీర్ధము, గురువు వీటిపట్ల ఎవరికి ఎలాంటి భావముంటుందో. వారి ప్రాప్తము కూడా అలాగే వుంటుంది. దీన్ని తెలియజేసే వృత్తాంతమొకటి చెప్తాను వినండి" అన్నారు.

పాంచాలదేశపు యువరాజు దుర్జయుడు. ఒకనాడు అతడు అరణ్యానికి వేటకు వెళ్లి అలసిపోయి దాహార్తితో బాధపడుతున్న అతనికి ఒక బోయవాడు మంచినీటి కొలను చూపించాడు. దాహం తీర్చుకుని కొలను పక్కనే వున్న శివాలయంలో విశ్రాంతి తీసుకున్నాడు. అప్పుడు బోయవాడు ఆలయం పక్కనే పడివున్న శివలింగాన్ని చూచి, "అయ్యా నాకు శివ పూజ చేసుకోవాలని కోరిక, కానీ పూజా విధి తెలియక సంశయిస్తున్నారు. దయచేసి పూజా విధానం తెలియజేస్తే మిమ్మల్ని గురుదేవులుగా భావించి శివారాధన చేసుకుంటాను" అన్నాడు. అప్పుడా రాజకుమారుడు అతనితో "ఈ లింగాన్ని తీసుకుని శుభ్రం చేసి, పూజా స్థలంలో స్థాపించు. ప్రతిరోజు స్మశానంలో బూడిద తెచ్చి శివునికి అర్పించు. నీవు తినే పదార్ధాలను ముందు ఈ లింగానికి నైవేద్యంగా అర్పించి ఆ తర్వాతే నీవు భుజించు" అన్నాడు.

ఆ బోయవాడు ఇంటికి వెళ్లి ఆ యువరాజు చెప్పిన ప్రకారమే లింగాన్ని పూజించసాగాడు. ఒకరోజు ఎంత వెదకినా చితాభస్మం దొరకలేదు. గురువు ఉపదేశించినట్లుగాక, మన ఇచ్ఛ వచ్చినట్టు చేస్తే ఫలితం వుండదు. ఆయన చెప్పినట్లు చెయ్యకపోతే ఇన్ని రోజులు చేసిన ఫలితం వ్యర్ధమైపోతుంది. గురువాఙ్ఞ మీరడం అంటే కోరి నరకాన్ని, దరిద్రాన్ని అహ్వానించడమే అని తనలో తాను మధనపడుతుండగా, అతని భార్య అతనితో ఆ రోజు శివ పూజకు కావలసిన బూడిద కోసం తన శరీరాన్ని అర్పిస్తానంటుంది. దానికి అతడు ఒప్పుకోడు, చివరికి ఆమె అతన్ని ఒప్పించి ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుని ఇంటికి నిప్పు పెట్టమంటుంది. అతడలాగే చేసి సర్వమూ భస్మమైపోయాక దానినంతా భక్తితో శివ లింగానికి అర్పించి శ్రద్ధగా పూజచేసి నైవేద్యం అర్పించి, పూజ నిర్విఘ్నంగా కొనసాగినందుకు ఎంతో సంతోషిస్తాడు. పూజ ముగిసింది కనుక ప్రసాదం స్వీకరించడానికి రమ్మని భార్యని పిలుస్తాడు. శివుని అనుగ్రహం వల్ల ఆమె పునరుజ్జీవుతురాలై వస్తుంది. దానికతడు ఆశ్చర్యపోయి ఇదంతా శివలీలని గుర్తించి శివుణ్ని స్తుతించగా శివుడు ప్రత్యక్షమయి, వారు జీవితాంతం కోటి జన్మలు శివలోకంలో నివశించేలా వరమిచ్చి అదృశ్యమవుతాడు.

అని చెప్పి శ్రీ గురుడు వారితో "గురువు ఆఙ్ఞని పాటించే వారికి సాధ్యం కానిది లేదు. పూర్ణ విశ్వాసముండి సేవిస్తే, ఎంతటి ఫలితమైనా లభిస్తుంది. ఎవరి భావానికి తగిన ఫలితం వారికి లభిస్తుంది. కనుక నరహరి సేవకు తగిన ఫలితం లభించకపోదు" అంటారు. ఆ తర్వాత స్వామి సంగమానికి వెళ్లి అక్కడ శ్రద్ధగా పూజ చేస్తున్న నరహరిని చూచి ఆనందిస్తారు. నరహరిశర్మ స్వామి వారిని చూచి నమస్కరించాడు, అప్పుడు స్వామి వారు తమ కమండలంలోని నీరు ఎండిన మేడి కట్టెపై జల్లారు. ఆ నీరు తగలగానే మేడి కట్టె చిగురించింది. సంగమానికి వచ్చిన వారందరూ చూస్తుండగానే అది పెరిగి చిన్న మేడి చెట్టైంది. అది చూచి నివ్వెరబోయి చూస్తున్న నరహరిశర్మకి కుష్టు రోగం అదృశ్యమై అతని శరీరం బంగారు ఛాయతో మెరిసిపోసాగింది. అతడు ఆనందభాశ్పాలు రాలుస్తూ శ్రీ గురుని స్తుతించాడు.


యవనరాజు కథ :
-----------------
వైఢూర్య నగరాన్ని ఒక యవనరాజు పరిపాలిస్తుండేవాడు. పూర్వజన్మ సంస్కారం వల్ల అతను పరమత సహనం కలిగి ఉండేవాడు. అతడు విఙ్ఞుడూ, శుధ్ధాత్ముడు. ఒకనాడతనికి పూర్వజన్మ కర్మ వల్లనో, దైవయోగం వల్లనో తొడమీద వ్రణం లేచింది. ఆ బాధ రోజురోజుకి ఎక్కువవడంతో ఒక సద్విప్రుణ్ని పిలిపించి ఉపాయం అడిగాడు. రాజా తీర్ధయాత్ర, దేవతారాధన, దానముల వల్ల కొన్ని పాపాలు, వ్యాధులు తొలగుతాయి. కాని అన్నిటికంటే శ్రేష్ఠమైనది సాధు దర్శనం. సాధు దర్శనం వల్ల సర్వ పాపాలు. వ్యాధులు తొలగిపోవటమే కాక, వారికి అనుగ్రహం కలిగితే భవరోగమనే అతి భయంకరరోగాన్ని పోగొట్టి ముక్తిని ప్రసాదించగలరు. కాబట్టి విదర్భ నగరానికి సమీపంలోనున్న పాపనాశ తీర్ధానికి వెళ్లి అక్కడ స్నానం చేస్తూ, దాన ధర్మాలు చెయ్యి - దాని వలన పాపం తొలగి ఉత్తమమైన వ్యాధి నివారణోపాయం అదే లభిస్తుంది అన్నాడు.

ఆ యవనరాజు ఆ విప్రుడు చెప్పిన విధంగా చేయసాగాడు, ఒకరోజు అతడు తీర్ధంలో స్నానం చేసి వస్తుండగా అతనికొక యతీశ్వరుడు కనిపించాడు. రాజు అతనికి నమస్కరించి తరుణోపాయం చెప్పమని ప్రాధేయపడగా ఋషభయోగి పింగళ అనే వేశ్య, కర్మ బ్రష్టుడైన బ్రాహ్మణుని అనుగ్రహించిన వృత్తాంతం తెలిపి - ఓ రాజా మహాత్ముల కృపాదృష్టిచేతనే ఎంతటి వ్యాధియైనా నశించగలదు.కనుక నీవు గంధర్వపురంలో వెలసిన కలియుగ దత్తప్రభువుయైన శ్రీ నృసింహ సరస్వతీ స్వామినే ఆశ్రయించు అని చెప్పారు. సరిగా అదే సమయానికి శ్రీగురుడు, ఇక్కడికి మ్లేచ్చ రాజు వస్తాడు. మేమిక్కడే ఉంటే ఇంకెందరో భక్తీ సదాచారము లేని వారొస్తారు అన్నారు. వారిలా చెప్పిన కొద్ది సమయంలోనే యవనరాజు గంధర్వపురం చేరి శ్రీగురుని గురించి వాకబు చేసి అనుష్టానానికి సంగమానికి వెళ్లారని తెలిసి, పల్లకినీ, పరివారాన్ని అక్కడే విడిచి తానొక్కడే త్వరత్వరగా సంగమానికి వెళ్లి స్వామిని దర్శించి చేతులు కట్టుకుని దూరంగా నిలబడ్డాడు.

అప్పుడు శ్రీ గురుడు ఓరి సేవకుడా! ఇన్నాళ్లకు కన్పించావేమీ? అన్నారు. ఆ మాట వినగానే అతనికి పూర్వజన్మ స్మృతి కలిగి, ఆనంద భాష్పాలు కారుస్తూ స్వామి పాదాలపైబడ్డాడు. ప్రభూ మీరు మా శ్రీపాద స్వామియే ఈ దీనుణ్ని ఇంత ఉపేక్షించారేమి. రాజ వైభోగాల భ్రమలో చిక్కి ఇన్నాళ్లు మీ పాదసేవ విడిచి మీకు దూరంగా పడివుండేలా చేసారే అన్నాడు. అప్పుడు స్వామి గంభీరవదనులై ఏమిరా, నీవు కోరుకున్నవన్నీ తనివితారా అనుభవించావా? లేక ఇంకేమైన మిగిలివున్నాయా? బాగా ఆలోచించుకొని చెప్పు అన్నారు. మీ దయవల్ల సకలైశ్వర్యాలతో రాజ్యుమేలాను, పుత్రపౌత్రులతో నా సంతతి వృద్ధిచెందింది. ఇక ఒకేఒక్క కోరిక మిగిలింది. దయతో మీరు ప్రసాదించినవి మీరొక్కసారి స్వయంగా చూడాలన్న కోరిక ఒక్కటే మిగిలింది అనగా, అతని రాజ్యంలో గోవధని నిషేధించమని చెప్పి, అతని ప్రార్ధనని మన్నించారు.


నిర్యాణం:
---------
ఎన్నో లీలలను చేసిన శ్రీ గురుడు బహుధాన్య నామ సంవత్సరం(1456)లో ఉత్తరాయణ పుణ్యకాలంలో, కుంభరాశిలోకి రవి, కన్యారాశిలోకి బృహస్పతి ప్రవేశించిన శిశిర ఋతువులో, మాఘమాసం, కృష్ణపక్షం పాడ్యమి శుక్రవారం నాడు శ్రీశైలం చేరి - అక్కడ కదళీవనంలో తమ అవతారాన్ని గుప్తపరిచారు. అక్కడ 300 ఏళ్లు తప్పసు చేసి తిరిగి స్వామి సమర్ధగా అవతరిస్తానని తెలియజేసారు.


హుమాయున్ గురువు కథ : ( పై లీల పోలివున్న కథ )
----------------------------
శిరిడీ సాయిబాబా ఒకనాడు భక్తులతో ఈ కథ చెప్పారు , "చాలకాలం క్రితం పైఠానులో నేనొక బ్రాహ్మణునితో వున్నాను. నాకు అతడే భిక్ష ఇచ్చేవాడు. ఈ రోజుల్లో అలాటివారు అరుదు, ఇప్పుడందరూ స్వార్ధపరులే. ఇప్పుడతనెక్కడున్నాడో అల్లాకే ఎరుక. నేనంతకు కొన్ని వేల సంవత్సరముల పూర్వంగూడా ఉన్నాననుకో! నేనప్పటికే వృద్ధుడుగా ప్రయాగలో చుట్టకాలుస్తూండేవాణ్ని. అక్కడ వీణ చిరుతలు ధరించి, భజన చేస్తుండే బ్రాహ్మణుడు నా వద్దకొచ్చి నమస్కరించి, ముకుంద్బ్రహ్మచారి చేస్తున్న తపస్సు త్వరలో పూర్తవుతుంది. ఓరిమి వహించమని మీరతనితో చెప్పండి, నిజంగా ఇది భగవదాఙ్ఞ. నేనొక వ్రతమాచరిస్తున్నాను కనుక ఈ పని మీరేచేయాలి అన్నారు."

నేను ముకుంద్ నివశించే మఠానికి వెళ్లాను. అది నీమ్‌గాఁవ్ అంత పెద్దది. ముకుంద్ అతని శిష్యులు నేను ముస్లీం అని తలచి, "మేమిక్కడ అనుష్టానం చేసుకుంటున్నాము, నీ రాక వల్ల ఈ మఠం అపవిత్రమైంది. మేమంతా ఆత్మాహుతి చేసుకుంటాం, ఆ పాపం నీకు సంక్రమిస్తుంది అన్నారు." నేను, "అల్లామాలిక్! అనుకొని, నేను చెప్పవలసిన మాట మనసుతోనే చెప్పి బయటకు వెళ్లాను. బజారులో ఒక యువరాజు అతని భార్య, కొద్దిమంది సేవకులు కన్పించారు. ఆ యువతికి త్రాగే నీరు కావాలని భర్త అందరినీ అడుగుతున్నాడు. నా కమండలంలో నీరిచ్చాను. అవి త్రాగి ఆమె నా పాదాలపై పడింది, ఆమెను ఆశీర్వదించాను. వెంటనే యువరాజు మోకరిల్లి, నా గతి ఏమిటి? నాకు దిక్కెవరు? అన్నాడు.నేను అమర్‌కోట వెళ్లండి, అక్కడ మీకు కొడుకు పుడతాడు. అతడు ఈ దేశానికి రాజవుతాడు. నీకేమీ భయంలేదు అని ఆశీర్వదించాను, వాళ్లు అలాగే వెళ్లారు. వారికి పుట్టిన బిడ్డడి పేరు జలాలుద్దీన్ మొహమ్మద్. అతడే తర్వాత అక్బర్ చక్రవర్తిగా కీర్తికెక్కాడు. అంతా భగవంతుని కృప."


** అక్బర్‌ చక్రవర్తికి పూర్వజన్మ స్మృతి ఉండేదని, తన పేరు ముకుంద్ అని గతంలో తానాచరించిన తపస్సులో లోపం వల్ల తాను చక్రవర్తిగా జన్మించానని అంతరంగీకులతో చెప్పేవాడని చరిత్ర.

సింధియా కథ :
---------------
సింధియాకు అందరూ కుమార్తెలే. అతడు 1903లో గాణగాపురం దర్శించి, తనకు కొడుకు జన్మిస్తే దర్శనానికి వస్తానని మొక్కుకున్నాడు. కానీ అది నెరవేరాక అతడు మొక్కు తీర్చలేదు. అతడు 1914లో శిరిడీ దర్శించాడు. అతన్ని చూస్తూనే సాయి ఉగ్రులై. " ఒక్క కొడుకు కలిగాడని నీకింత గర్వమా? అంతటి అదృష్టం నీ రాతలో లేదు. నా శరీరం చీల్చి నీకొకణ్ని ప్రసాదించాను." అన్నారు.అంటే శ్రీ నృసింహ సరస్వతియే సాయిబాబా.
 
మాణిక్య ప్రభువు అవతారం :
-----------------------------------
శ్రీ మాణిక్య ప్రభువు ఈశ్వరనామ సంవత్సరం 22-12-1817 మార్గశిర శుద్ధ చతుర్దశి మంగళవారం నాడు జన్మించారు.వీరి తండ్రిగారు మనోహర నాయకుడు, తల్లిగారి పేరు బయాదేవి. వీరిది కళ్యాణి నగరం ఇది గుల్బర్గాకు 50 మైళ్ల దూరంలో ఉంది.ప్రభువుల వారు చిన్నతనం నుండే మానవాతీత శక్తులను ప్రదర్శించేవారు, ఒక్కక్కప్పుడు మహారణ్యంలో మధ్యభాగానికి వెళ్లి అక్కడ పశుపక్షులు, జంతువులతో కాలము గడుపేవారు, ఒక్కోసారి కళ్యాణినగరం చుట్టుపక్కలవున్న తీర్ధక్షేత్రాలని సందర్శించేవారు. శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధములో శ్రీ అవధూతలీలలు ఏవైతే చర్చించారో అవన్నీ శ్రీ ప్రభువులవారు చేసి చూపేవారు.బాల్యంలోనే వారి అవధూతస్థితిని తెలియజేసే లీలలు ఎన్నో.

భీమాబాయి కథ :
-----------------
అప్పారావు అనే బ్రాహ్మణుడు నిజాము సైన్యానికి చెందిన ఒక అరబ్బుల కంపెనీలో జమాదారుగా పనిచేసేవాడు.ఇతను మహాభాగ్యవంతుడు,ఇతని భార్యే భీమాబాయి. వీరికి సంతానం లేకపోవడంతో భీమాబాయి ఎన్నో నోములు,వ్రతాలు, ఉపవాసాలు చేసేది. అయినా ఫలితం లేకపోయింది. ఈమెకు ఒకరోజు కళ్యాణినగరమందున్న మాణిక్యప్రభువు మహిమల గురించి తెలిసింది. వెంటనే భర్త ఆఙ్ఞ తీసుకొని ప్రభువువద్దకు బయలుదేరింది. ధనవంతురాలు కావడంతో ఈమె వెంట దాసదాసీ జనం, కొంతమంది సిపాయిలు, గుఱ్ఱపురౌతులు వున్నారు. కళ్యాణినగరం ఒకమైలు దూరంలో ఉందనగా వీరికి కొంతమంది బాలురు కలిసి ఒక పిల్లవాడ్ని కొడుతున్న దృశ్యం కంటపడింది.ఆ దృశ్యాన్ని చూచిన భీమాబాయి ఒక సిపాయిని పిలిచి, పిల్లల తగవుకి కారణం ఏమిటో తెలుసుకుని పరిష్కరించమని ఆఙ్ఞాపించింది.

సిపాయి పిల్లల్ని గొడవకు కారణమేమిటని అడగ్గా, అంతవరకు దెబ్బలు తింటున్న బాలుడు ముందుకువచ్చి మేము బాలురము, తగవులాడుకొంటాం, ఈ వ్యవహారంలో నువ్వెందుకు కలుగజేసుకుంటున్నావని ప్రశ్నించి - నిజంగా ఈ తగవులాటని పరిష్కరించాలనే కోరిక నీకున్నట్లయితే, వీరికి నేను ఎనిమిది గవ్వలు బాకీపడ్డాను, ఆ పల్లకీలోని స్త్రీ వీరికి ఎనిమిది గవ్వలను ఇచ్చినట్లయితే ఆమెకు ఎనిమిది మంది బిడ్డలు కలుగుతారని చెప్పాడు. ఆ సిపాయి పరుగునపోయి ఈ విషయాన్ని యజమానురాలికి చెప్పాడు. భీమాబాయి వద్ద గవ్వలు లేకపోవడంతో పైకం ఇస్తానని చెప్పమంది. సిపాయి ఈ విషయం బాలునికి చెప్పగా - మాకు రూపయలక్కర్లేదు, గవ్వలు బాకీపడ్డాం గనుక గవ్వలే కావాలి అన్నాడు. ఎంత వెదికినా గవ్వలు దొరకలేదు, చివరికి ఒకసిపాయి తన పర్సుకి గవ్వలు కుట్టువుండటం చూచి అవి పనికివస్తాయేమోనని తలచి అవి పిల్లవాడికి ఇచ్చారు. ఆ గవ్వలు పుచ్చుకున్న పిల్లవాడు నీకు ఎనిమిదిమంది పిల్లలు కలుగుతారని చెప్పి మిగిలిన పిల్లలతో కలిసి సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు.తాను గవ్వలిచ్చిన పిల్లవాడే ప్రభువు అని ఆమెకి తెలీదు.

వారు అక్కడ నుండి ప్రయాణం సాగించి చీకటిపడే సమయానికి ప్రభువు ఇంటికి చేరుకున్నారు. ఆమె ప్రభువు గురించి వాకబు చేయగా ఇంకా ఇంటికి రాలేదు, ఎప్పుడూ తిరుగుతునే ఉంటాడని, ఎప్పుడు వస్తాడనేది ఎవరమూ చెప్పలేమని కుటుంబసభ్యులు చెప్పారు. ప్రభువు దర్శనం అయ్యేవరకూ భోజనం చెయ్యడం భీమాజీకి ఇష్టంలేదు, కనుక రాత్రి భోజనం మానివేసి ప్రభువు కోసం ఎదురుచూస్తూ వుండిపోయింది.ఇలా మూడు రోజులు గడిచిపోయాయి, ప్రభువు రాలేదు భీమాజి ఉపవాసదీక్ష మానలేదు. చివరికి ఆమెపై ప్రభువుకు దయకలిగి హఠాత్తుగా ఇంటికివచ్చారు. వస్తూనే అమ్మా ఆకలిగావుంది నాకేమైనా పెట్టు అని అడిగి, భోజనం చేసిన తర్వాత ఇంటివద్దనే ఉన్న భీమాబాయిని చూచి నీకిదివరకే ఎనిమిది మంది సంతానాన్ని అనుగ్రహించాను, నన్ను ఇంకెందుకు బాధిస్తావు అన్నారు?. తాను గవ్వలిచ్చింది ఈ బాలునికేనని అప్పటికిగానీ ఆవిడ గుర్తించలేదు. ప్రభువు అనుగ్రహానికి సంతోషించి ఇంకొకదినం అక్కడే గడిపి తిరిగి హైదరాబాదు బయల్దేరింది.

బీదరు యవనులు :
-------------------
బీదరులో తన శిష్యులను అనుగ్రహించి అనేక లీలలను చేసిన ప్రభువు ఒకనాడు ఒకే రూపంతో అనేక మంది శిష్యుల ఇళ్లకు వెళ్లి ఆతిధ్యం స్వీకరించారు. ఈ విశ్వరూపదర్శనంతో ఆయన కీర్తి బీదరు అంతటా వ్యాపించింది. యవనులకు కూడా ప్రభువుపై భక్తివిశ్వాసాలేర్పడ్డాయి.కానీ కొందరు సంశయాత్మకులైన యవనులు మాత్రం ఆయన్ని పరిక్షించదలచారు. తాము పెట్టే పరిక్షలో ప్రభువు నెగ్గకపోయినట్లయితే ఆయన కీర్తికి భంగం కలుగుతుందని వారి ఆలోచన. అప్పటి హిందు, ముసల్మాను సంగమంలో అనేకమంది బైరాగులు, ఫకీరులు ఉన్నారు, అక్కడున్న వారిలానే ప్రభువు కూడా ఒక సాధారణ ఫకీరేనని నిరూపించాలని వారి తాపత్రయం. తమ ఆతిధ్యం నిరాకరించి, తాము పెట్టిన పదార్ధాలన్నిటినీ ఆయన స్వీకరించనట్లయితే ఆయన మీద హిందూ పక్షపాతి అనే ముద్రవేయాలనేది వారి ప్రణాళిక. దీంతో ఆయన హిందూ,ముస్లీంలు ఒకటే అని చెప్పే మాట ఒక బూటకంగా ప్రజలు గుర్తిస్తారని తలచారు. ఈ విధమైన అంచనాలతో ఒకరోజు ప్రభువుని తమ ఆతిధ్యం స్వీకరించవలసిందిగా అర్ధించారు, ప్రభువు అంగీకరించారు. ఆతిధ్యం స్వీకరించే రోజు రానే వచ్చింది, ఆతిధ్యం ఇచ్చే స్థలాన్ని వైభవంగా అలంకరించి, ప్రభువు కూర్చోవడానికి సభ మధ్యలో సింహాసనం ఒకటి ఏర్పాటుచేసారు. ప్రభువు రాగానే వారి మెడలో పూలమాల వేసి అలంకరించారు, వారి గౌరవమర్యాదలకు ఎటువంటి లోటు రాకుండా ఏర్పాట్లు జరిగాయి.ప్రభువు సింహాసనం అలంకరించారు. భోజనపదార్ధాలు ఎవరి ఆసనం ముందు వారికి ఏర్పాటుచేసారు,పళ్లెముల్లో వున్న భోజనపదార్ధాలపై శుభ్రమైన గుడ్డలు కప్పారు, వాటిల్లో మాంసంతో తయారుచేసిన వంటకాలే ఎక్కువగా వున్నాయి.

భోజన సమయమైంది, ప్రభువు తన శిష్యునితో పళ్లెము పైనున్న గుడ్డను తొలగించమని ఆఙ్ఞాపించారు. గుడ్డతీయగానే పళ్లాలలో మాంసపు వంటకాల స్థానే ఖర్జూరాలు, మిఠాయిలు, పుష్పాలు కనిపించాయి. విందులో పాల్గొంటున్న వారందరూ తమ తమ పళ్లాలపైనున్న గుడ్డలను తొలగించగానే వాటిల్లోనూ మాంసపు వంటకాల బదులు ఖర్జూరాలు, మిఠాయిలు, పుష్పాలు కనిపించాయి. ప్రభువును హేళన చెయ్యాలని తలచిన వారెవరైతే ఉన్నారో, వారికి భయం పట్టుకుంది. ప్రభువు సామాన్యమైన మానవుడు కాదని, గొప్ప ఔలియా (మహాత్ముడు) అని గుర్తించి తమ తప్పును క్షమించమని శరణువేడారు. దయాహృదయులైన ప్రభువు వారిని క్షమించారు. ముసల్మానులందరూ ప్రభువుకు బ్రహ్మరధం పట్టారు. వారు హిందువులకివ్వదగ్గ బిరుదుల్లోకెల్లా అత్యంత పెద్దదైన "పీరాన్‌ పీర్‌ దస్తగిర్" అనే బిరుదునిచ్చారు. ప్రభువు ఖ్యాతి హైదరాబాదంతటా వ్యాపించి అచ్చటినుండి కూడా పెక్కుమంది ముస్లీంలు ప్రభువు దర్శనార్ధం రాసాగారు. ఇక బీదరులోని హిందువులు,ముస్లీంలు ప్రభువు గాదీని ఆక్కడ ఏర్పాటుచేయవలసిందిగా కోరారు. ముసల్మానులు అధికంగా నివసించు ప్రాంతంలో ప్రభువు తన గాదీని ఏర్పాటుచేయడానికి అనుమతినిచ్చారు.

నిర్యాణం :
----------
శ్రీ మాణిక్య ప్రభువు తన నిర్యాణానికి ఆరు నెలల ముందే ఈ విషయం తన ముఖ్య శిష్యులకి వెల్లడించారు. ఆ నలుగుర్ని తామున్న కుటీరంలోనే ఒక గోతిని తవ్వమని చెప్పి, ఆ గోతిలోనే కూర్చొవడానికి ఒక అరుగును ఏర్పాటుచేయవలసిందని చెప్పి, ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా వుంచాలని వారిని ఆఙ్ఞాపించారు. దత్త జయంతి సమీపించడం చేత భక్తులందరూ తండోపతండాలుగా మాణిక్య నగరానికి రాసాగారు, గ్యార్వీ పండుగ కూడా అదే నెలలో వుండటంతో ముసల్మానులు కూడా అనేక మంది ప్రభువు దర్శనార్ధం వస్తున్నారు. ప్రభువుల వారు మార్గశీర్ష శుద్ధ దశమినాడు దర్బారు చేసి, భక్తులందరినీ ఎంతో ప్రేమగా ఆదరించారు. ఉదయం నుండీ సాయంత్రం వరకూ దర్బారు నిర్విరామంగా సాగుతూనే వుంది. అడిగిన వారికి లేదనకుండా ప్రభువు దాన ధర్మాలు చేస్తూనే వున్నారు. రాత్రి అవగానే ప్రభువు విశ్రాంతి కోసం కుటీరంలోకి వెళ్లారు. అదే ప్రభువుల వారు చేసిన చివరి దర్బారు. 1865 మార్గశీర్ష శుద్ధ ఏకాదశి రోజున ప్రభువుల వారు సమాధిలో యోగాసనంలో కూర్చున్నారు. తాత్యా మహరాజు గారి కుమారులిరువురిని పిలిపించుకొని వారిని కొద్దిసేపు తమ సన్నిధిలో కూర్చుండ బెట్టుకుని వారికి ప్రసాదాలిచ్చి, వారి మెడలో పుష్పహారాలు వేసి వారిని వెళ్లిపొమ్మని ఆఙ్ఞాపించారు. వారి వెళ్లిపోగానే వెంటనే గొయ్యి ముందరి భాగాన్ని మూసివేయమని ఆఙ్ఞాపించారు. తమ సమాధి విషయాన్ని పౌర్ణమి వరకూ గోప్యంగా వుంచమని, పండుగలు, ఉత్సవాలు యధావిధిగా జరుపవలసిందని ఆఙ్ఞాపించారు. దత్త జయంతి యధాప్రకారం జరిగింది. ప్రభువ దర్శనార్ధం వచ్చిన వారందరూ వారి దర్శనం కోసం పట్టుబట్టారు, కానీ ప్రభువు ధ్యానంలో వున్నారని దర్శనం ఇవ్వరని చెప్పడంతో కుటీరానికే నమస్కరించి భక్తులందరూ వెళ్లిపోయారు.
తరువాతి రోజు కుటీరం తీసివేసారు. ప్రభువు కనిపించకపోవడంతో భక్తులందరికీ వాస్తవం తెలిసిపోయింది, దాంతో భక్తులు మాణిక్య నగరాని విపరీతంగా వచ్చారు. వచ్చిన వారిలో కొందరు ముసల్మానులు ప్రభువు దర్శనానికి గట్టిగా పట్టుబట్టారు. కానీ బాపాచార్య మొదలైన శిష్యవర్గం కోపోద్రిక్తులైన భక్తులని శాంతింపజేశారు.

సాయితత్త్వం :
---------------
బాబా ఒకరోజొక కథ చెప్పారు," ఒకరోజు కొందరు ముస్లింలు వారితో విందారగించమని పట్టుబట్టారు.బ్రాహ్మణుడనైన నాకు మాంసాహారం నిషిద్ధమని చెప్పినా వారు వినలేదు, అప్పుడు వంటాకలపై గుడ్డకప్పి భగవంతుని ప్రార్ధించాను. గుడ్డ తీసేసరికి ఆ మాంసం పెద్ద గులాబి పూలుగా మారింది. ఆ ముస్లింలు ఆశ్చర్యపడి క్షమాపణ వేడుకున్నారు." ఈ లీల మాణిక్యప్రభువు వారు చేసారని మనం తెలుసుకున్నాం.

శ్రీ సాయి పూర్ణ దత్తావతారం కనుక, ఆయన త్రిమూర్త్యాత్మకుడు, పరబ్రహ్మ స్వరూపి, జగద్గురువు. సనాతన ధర్మమూర్తియైన దత్తస్వామి శ్రీ సాయి అవతారంలో ఫకీరుగా దర్శనమిచ్చారు.దత్తస్వామి ఏకనాధునికి, ఆయన గురువైన జనార్ధనస్వామికీ గూడ దర్శనమిచ్చారు. అందుకే దత్తాత్రేయుల వారిని మన హిందూదేవతలలో ఒకరిగా కాక అన్ని మతాల్లోను మహనీయులగా వెలసి, మానవాళికి ఎల్లప్పుడూ మార్గనిర్దేశకత్వం చేసే సద్గురుతత్త్వంగా గుర్తించాలి. అందుకే ఏ మతంలో వెలసిన మహనీయుని చరిత్ర చదివినా, వారి చరిత్రలన్నీ ఒకేలా ఉంటాయి.అంతటా ఉన్నది ఒకే తత్త్వం కాబట్టి అన్నింటా అదే వ్యక్తమౌతుంది. హిందూధర్మంలో దత్త స్వామిగాను, బౌద్ధంలో పద్మసంభవుడిగానూ, ఇస్లాంలో ఖిజిర్ మరియు మహబూబ్ సుభానిలుగా ప్రకటమైంది ఒకే తత్త్వం. వీరందరూ సంకుచిత మతోన్మాదాన్ని నిరసించి సామరస్యాన్నే బోధించారు.

భారతదేశంలో హైందవేతర మతాలు ప్రవేశించిన తర్వాత అన్ని మతాలు తనవే కాబట్టి, ఈ మతాల మధ్య సామరస్యతని ఏర్పాటుచేసి మానవులందరిలో ఐకమత్యాన్ని నెలకొల్పడమే దత్తప్రభువుల వారి సంకల్పంగా కనిపిస్తుంది.శిరిడీ సాయిబాబా గారి అవతారానికి వచ్చే సరికి ఆయన అన్ని మతాలని ఒక్కటిగా చేసి, ప్రతి మతంలోని అత్యున్నతమైన విలువలని గ్రహించి ఒక మతాన్ని ఏర్పాటు చేసారు.అదే సాయి తత్వం. భగవంతుడు స్వయంభూః అన్నారు దీనర్ధం ఆయన్ని ఆయనే సృష్టించుకునేవాడని, అలాగే తనని తానే సృష్టించుకొని,తన పరిపాలనకు ఒక స్థానం అవసరం కాబట్టి శిరిడీని కేంద్రంగా చేసుకొన్నారు.
 
శ్రీ స్వామి సమర్ధ అవతారం : (అక్కల్‌కోట మహరాజ్)
----------------------------------
 
మహారాష్ట్ర దేశంలోని అక్కల్‌కోట గ్రామంలో ఎక్కువ కాలం నివశించి ఆ ఊరిని గొప్పక్షేత్రంగా రూపొందించిన మహాయోగి శ్రీ అక్కల్‌కోట మహారాజు. ఈయన కలియుగంలో శ్రీ దత్తాత్రేయుని నాలుగవ అవతారం. శ్రీ స్వామి 1856 వ సంవత్సరం పంచమి బుధవారం నాడు మొదటిసారిగా అక్కల్‌కోట లో కనిపించి సుమారు ఇరవై సంవత్సరాలపాటు అక్కడే వున్నారు. వీరి అసలు పేరు, తల్లిదండ్రులు, కులగోత్రాలు మొదలైన వివరాలు ఎవరికీ తెలియవు. ఆయన ఎప్పుడూ ఎవరికీ ఈ వివరాలు నిశ్చయంగా చెప్పలేదు. అరుదుగా అప్పుడప్పుడూ ఆయన చెప్పిన వివరాలు ఒక రీతిగా లేవు.

స్వామి ఎవరో తెలుసుకోవాలని మీరెవరు? అని అడిగిన భక్తునితో ఆయన "వటవృక్షము మూలము, మూలానికి మూలం, మాది దత్త నగరం" అన్నారు.అళౌనీ బువా అనే బ్రహ్మచారి తన నలుగురి మిత్రులతో సహా పూరీ జగన్నాధ యాత్రకి వెళ్తూ అస్వస్థులైనప్పుడు, వారి బాగోగులు చూచేవారు లేక చింతపడుతుంటే, నడుంమీద చేతులుంచుకొని స్వామి సమర్ధుల వారు వారి గదిలోకి ప్రవేశించి, వారిపై తమ కృపా దృష్టిని సారించగానే వారు స్వస్థులయ్యారు. అప్పుడు బువా వారికి నమస్కరించి. ఆశ్చర్యంతో మీరెవరు స్వామీ అని అడగ్గా, ఆయన చిఱునవ్వుతో "అఖండ విశ్వమే నేను, నేను సర్వత్రా వున్నాను, ఐనా సహ్యాద్రి, గిర్నార్, కాశీ, మాతాపూర్, కరవీర్, పాంచాలేశ్వర్, ఔదుంబర్, కరంజనగర్, నరసింహవాడి, గాణగాపూర్లు నా ముఖ్యమైన స్థలాలు అన్నారు.స్వామి వారి వివరాలు తెలుసుకోవాలని చింతోపంత్ ఆయన్ను వివరాలడిగాడు, దానికాయన "మా తల్లిదండ్రులు మాదిగవారు, వృత్తి తోళ్లపని" అని చెప్పారు, మరొకసారి మరొక భక్తునితో "మేము కదళీవనం నుండి వచ్చాం" అన్నారు. కార్వే అను భక్తునితో "నేను యజుర్వేద బ్రాహ్మణుడను, కాశ్యప గోత్రం, పేరు నరసింహభాన్, మీన రాశి. మళ్లీ అడిగితే చెప్పు తీసుక్కొడతా" అన్నారు.

శ్రీ నృసింహ సరస్వతిగా శ్రీశైలంలోని కదళీవనం చేరి అక్కడ కొంతకాలం వున్న తర్వాత కొంతకాలానికి వీరు హిమాలయ పర్వతాలు చేరి, అక్కడ సమాధి నిష్టలో 300 సంవత్సరాల పాటు కూర్చుండిపోయారు. ఆయనను పుట్టలు పూర్తిగా కప్పివేశాయి, అక్కడ ఓ చెట్టు కూడా మొలిచింది. కొంతకాలానికి కట్టెలు కొట్టుకునేవాడు ఒకడొచ్చి ఆ చెట్టును నరికే ప్రయత్నంలో అతను వేసిన గొడ్డలి వేటు పుట్టకు తగిలి దాని నుండి రక్తం కారింది. అది చూచి పుట్టను తొలగించి చూడగా సమాధినిష్టలో వున్న స్వామి మేల్కొన్నారు. స్వామి అతనికి అభయమిచ్చి ఈ సంఘట్న తన అవతార కార్యాన్ని కొనసాగించమన్న దివ్య ప్రభోదంగా తలచి - అక్కడ నుండి దేశమంతటా పర్యటిస్తూ అక్కల్కోట చేరి అక్కడ షుమారు 20 సంవత్సరాలపాటు అక్కడే వుండి, చివరికి అక్కడే తమ అవతారాన్ని చాలించారు. ఆయన అక్కల్కోటలో ప్రసిద్ధికెక్కిన తర్వాత,ఆయన్ను దేశపర్యటనలో కలుసుకున్న స్వాములు.యోగులు,భక్తుల ద్వారా ఈయన దేశమంతటా పర్యటించినట్టుగా, ఎన్నో ఆధారాలు లభ్యమయ్యాయి.


అంధుని కథ :
-------------
ఒకసారి స్వామి దేశముఖ్ అనే భక్తుని ఇంట్లో కూర్చొని వున్నారు. అప్పుడు శివాబాయి అనే ఇల్లాలు తన కొడుకుని స్వామి ముందుంచుతూ, "ఉపనయనం అయిన దగ్గర నుండి నా బిడ్డకు చూపు లేకుండా పోయింది, వాడికి దృష్టి ప్రసాదించవలసింది" అని కోరింది. అప్పుడు స్వామి " తల్లీ మమ్మల్ని పరిక్షించడానికి ఐదుగురు రాక్షసులు వస్తున్నారు, వారు వచ్చాక అతనికి దృష్టి కలుగుతుంది" అన్నారు. సరిగ్గా స్వామి అన్నట్లే కొద్దిసేఫట్లో నల్లగా, ధృడంగా వున్న ఐదుగురు బ్రాహ్మణులు వచ్చారు. వారి కంకణాలు, దుశ్శాలువాలూ చూస్తే వారు పండితులనే సంగతి తెలుస్తూనే వుంది. వారు స్వామిని పరిక్షించడానికి వచ్చారు, రాగానే స్వామిని గౌరవపూర్వకంగా నమస్కరించక, వారిని ఎలా పరిక్షించాలని వారిలో వారే సంస్కృతంలోనూ, కన్నడ భాషలోనూ తర్కించుకున్నారు. కాసేపటికి వినయం నటిస్తూ స్వామికి నమస్కరించారు.

అపుడు స్వామి అంధుడైన శివబాయి కుమారునితో "గణేషా! ఇటువచ్చి ఆ నల్లటి రాక్షసుల మనసుల్లో వున్న ప్రశ్నలూ,వాటికి సమాధానాలూ చెప్పు!" అన్నారు. వెంటనే ఆ పిల్లవాడు అక్కడకొచ్చి నిల్చుని ’నాకేమీ తెలియదే? నేనెట్లా చెప్పేది?’ అన్నాడు. స్వామి నవ్వుతూ, "ఓహో అలాగా!" అని తన మెడలో వున్న చేమంతి పూలదండ ఆ అంధుని మెడలో వేసి, రెండు చామంతి పూలతో అతని రెండు కళ్లను తాకారు. వెంటనే ఆ పిల్లవాడు తన వెన్నులో ఏదో మహాశక్తి ప్రవహించినట్లు ఒక పులకరింతతో లేచి నిలబడి వారి మనస్సులోని ప్రశ్నలు చెప్పి, వాటికి శాస్త్రాధారాలతో సమగ్రంగా సమాధానాలు కూడా చెప్పాడు. అపుడా బ్రాహ్మణులు భయకంపితులై స్వామికి నమస్కరించి తలలు వంచి నిలబడ్డారు. అప్పుడు స్వామి ఉగ్రులై వాళ్ల నాయకుణ్ని ఉద్ధేశించి "అన్ని కులాల వారి దగ్గరా విచక్షణ లేకుండా భిక్ష తీసుకుంటున్నానని మీరు నన్ను పరిక్షించడానికి వచ్చారు. కానీ ఇదిగో నే చెపుతున్నా విను నీవు ఇమాన్బ ముసల్మాను అనే యవనుని వల్ల నీ తల్లికి జన్మించావు." అన్నారు. ఆ మాట వినగానే వారి నాయకుడికి స్వామిని పరిక్షించబూనడం ఎంత ప్రమాదకరమో అర్ధమయి, పశ్చాత్తాపంతో స్వామిని క్షమాపణ వేడుకున్నాడు. హృదయపూర్వక పశ్చాత్తాపం మానవుని పునీతుని చెయ్యగలదని చెప్పి, ఇక ముందు మంచి నడత కలిగివుండవలసిందని హితవు చెప్పారు.

ఇటువంటి అద్భుత సంఘటనే శ్రీగురు చరితామృతంలోనూ వుంది. ఉత్తరాది నుండి వచ్చిన పండితులు తమ అంత విద్వాంసులు లేరని విర్రవీగుతూ శ్రీగురుని శిష్యుడైన త్రివిక్రమ భారతిని తమతో వాదించి గెలవనీ లేదా, ఓడినట్టు జయపత్రికైన ఇమ్మని పట్టుబట్టగా, దానికి ఆయన అయ్యా నేను స్వతంత్రుడనుగాను మా గురువుగారే మీకు సమాధానమివ్వగలరని చెప్పి శ్రీ నృసింహ సరస్వతిగారి వద్దకు తీసుకెళ్తాడు. వేదపండితులు శ్రీగురుని వద్దకూడా అదే విధంగా ప్రవర్తించడంతో - వారు ఆ దారినే వెళ్తున్న మాతంగుడనే చండాలున్ని పిలిచి ఏడు గీతలు గీయించి అవి దాటి, ఈ విప్రులని జయించు అన్నారు. అతడలాగే చేసి చర్చలో వారిని ఓడించాడు. పరబ్రహ్మ స్వరూపి ఐన గురువుని పరిక్షించబూనడం దుస్సాహసం అవుతుంది. అత్యంత సాధారణమైన మానవులమైన మనసు వారి దర్శనం దొరకడమే దుర్లభం - అట్టి సాంగత్యం లభించినపుడు దానిని సద్వినియోగం చేసుకోవడమే ఉత్తముల లక్షణం.

వర్షాలు :
--------
ఒక సంవత్సరం అక్కల్కోట ప్రాంతంలో వర్షాలు లేక కరువొచ్చే ప్రమాదం ఏర్పడింది. చాలామంది ప్రజలు చోళప్ప ద్వారా స్వామి వారికి తమ మొరను వినిపించారు. దానికి స్వామి "వేదంలోని పర్జన్య సూక్తం చదివించి, రేణుకా సహస్రనామం పారాయణం చేయండి." అన్నారు.
రెండు రోజులు తర్వాత తన సేవకులతో కలసి స్వామి జేవురు అనే పల్లెటూరు వెళ్లి అక్కడ శివాలయంలోని లింగానికేసి చూస్తూ ఆయన ఇంకా వర్షాలు పంపలేదేమి? అని గర్జించారు. అక్కడ నుండి వారసంగ్ అనే మరో పల్లెటూరు వెళ్లి అక్కడ శివాలయంలోని దేవతలందరినీ తిట్టి, ఆ విగ్రహాలను, "మీకు శనగలు కావాలా?" అని అడిగి, ఊళ్లో నుండి శనగలు తెప్పించి పార్వతీ, శంకరుల మీద చల్లరు. వెంటనే కుంభవృష్టి కురిసి అక్కల్కోట చుట్టూ పాతికమైళ్ల వరకూ వర్షంతో నిండిపోయింది.నెల్లూరులోని వెంకయ్య స్వామి కూడా ఇలాంటి వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు, ఎన్నోసార్లు కుంభవృష్టిగా వర్షాలు కురిపించిన సందర్భాలు ఆయన చరిత్రలో ఎన్నోచోట్ల కనిపిస్తాయి.

సద్గురువు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపి, కనుకనే ఆయన దేవతలకన్నా అధికుడు. దేవతలంటే రూపాలుకాదు, అతీతమైన శక్తులు. పంచభూతాలు, అనేక మానవాతీత శక్తులు అన్నీ సద్గురువు అధీనంలో వుంటాయి, గురువు మాట తు.చ తప్పకపాటిస్తాయి.సాయి చరిత్రలో, సాయి మసీదులో వుండి తుఫానుని ఆగమని గర్జించినప్పుడూ, సటకాతో ధునిలో విపరీతంగా ఎగసిపడుతున్న మంటలని తగ్గు తగ్గు అన్నప్పుడు పంచభూతాలెప్పుడూ ఆయన మాటని జవదాటలేదు. చాంద్పాటిల్ ఎదుట కేవలం సంకల్పశక్తితో నీటిని,నిప్పుని సృష్టించి ఈ సృష్టికి ఆద్యుడెవరో తెలియజేసారు. సద్గురువులు వివిధ రూపాల్లో వున్నా వారు ఏకత్వాన్ని కలిగివుంటారు.ఊడలెన్నో కలిసి మఱ్ఱిచెట్టు మహావృక్షంగా కనిపిస్తుంది. మఱ్ఱిచెట్టు ఊడలు భూమిని చేరి వేర్లు పోసుకుని, అదొక చెట్టులా కనపడుతుంది కానీ మూలం నుండి అది ఎన్నటికీ వేరుకాదు. స్వామి వట వృక్షం మూలం అనటంలో అర్ధం ఇదే.

**వటవృక్షం దత్తసాంప్రదాయానికి ప్రతీక. సాయిబాబా రెండవసారి శిరిడీ వెళ్లినప్పుడు మహల్సాపతి ఆయనకి సాయి అని నామకరణం చేసారు, అప్పుడు మహల్సాపతికి ఆయన దర్శనమిచ్చింది మఱ్ఱిచెట్టు క్రిందే.

నిర్యాణం :
----------
సుమారొక సంవత్సరంలో స్వామి నిర్యాణం చెందుతారనగా భక్తులకు చూచాయగా ఆ సూచనలందజేసారు. స్వామి తామెప్పుడూ నిద్రించే పరుపు మీదగాక దాన్ని చుట్టచుట్టి చెట్టు మీద పెట్టారు. భక్తులు హారతినిస్తుంటే నిలిపి, దానిని బోర్లించేవారు. మరో ఎనిమిది రోజులలో స్వామి నిర్యాణం చెందుతారనగా భక్తులందరితో "శివహర శంకర, నమామి శంకర, శివ శంకర శంభో! హే గిరిజాపతి, భవానీ శంకర, శివశంకర శంభో! అని భజన చేయించి, తాము అందులో పాల్గొన్నారు. చివరి నాలుగైదు రోజుల్లో స్వామి కొత్తరకమైన ఆటని ఆడటం మొదలుపెట్టార్య్, చిన్న చిన్న గుళకరాళ్లతో చిన్న,చిన్న సమాధులు కడుతుండేవారు. రోజురోజుకీ స్వామి వారి ఆరోగ్యం క్షీణించసాగింది, సుందరాబాయి అనే భక్తురాలు "స్వామీ మీరెప్పుడు స్వస్థత చెందేదీ?" అని అడిగింది. దానికి స్వామి నవ్వి " నన్ను మళ్లీ చాలా పర్వతాలు పిలిచినప్పుడు!." అన్నారు.
** పర్వతాల వలే నిశ్చల ధ్యాననిష్టలో వున్న మహాత్ములందరూ భగవంతుని అవతరణ కోసం ప్రార్ధించినపుడు అని ఆ వాక్కుకి అర్ధం.

1878వ సంవత్సరం, చైత్రశుద్ధ త్రయోదశి, మంగళవారం సాయంత్రం నాలుగు గంటలు కావొస్తున్నది. భక్తులు కోరిన మీదట స్వామి ఒక చెంచాడు ద్రవాహారం తీసుకున్నారు, ఒక భక్తుడు వారి నోరు తుడిచాడు. బాలప్ప వక్కపలుకు ఇస్తే స్వామి వేసుకున్నారు. భక్తులంతా దీనంగా,మౌనంగా స్వామివారి వైపు చూస్తూండిపోయారు. వారిలో ఒకరు భక్తులంతా అనుష్టానం చెయ్యాలా? అని అడిగారు. అనుష్టానం ఒద్దుగానీ అక్కడ కట్టేసిన ఆవునీ, దూడని విడిచిపెట్టండి అన్నారు. వాటిని విడిచిన వెంటనే ఆవూ,దూడా వేగంగా మఱ్ఱిచెట్టు దగ్గరున్న స్వామి వద్దకు పరుగెత్తి, వారికి ప్రదక్షిణ చేసి, వారి పాదాల మీద వాటి తలలు మోపి బయటకెళ్లి గడ్డి మేశాయి. అప్పుడు స్వామి "నా రాశి మీనరాశి అని, ఈ సమయంలో శని మీనరాశిలో వున్నాడా లేడా అని అడిగి, వున్నదని నిర్ధారణ చేసుకున్నారు. భక్తుడొకడు మీరేమైనా దానాలు చేస్తారా అని అడిగిన దానికి, ఆయన కావాలంటే "కావాలంటే మీరు చెయ్యండి, నాకున్నది ఈ కౌపీనమే కదా! అదీ నాది కాదు.త్వరలో దాన్ని కూడా విడువవలసి వస్తుంది." అన్నారు. కారణం నిర్యాణానికి ఒకరోజు ముందు స్వామి 350 రూll ఖరీదు చేసే శాలువాని ఒకదానిని నీళ్లలో తడిపి రామశాస్త్రి అవధాని అనే బ్రాహ్మణుడికి దానం ఇప్పించారు. ఇంకొక భక్తుడు స్వామి ఇక్కడ చలిగావుంది లోపలికి తీసుకెళ్లమంటారా అన్నాడు. అపుడు స్వామి మఱ్ఱిచెట్టు వైపు చూస్తూ "ఒద్దు నేను వెళ్లి ఆ చెట్టులో కలవాలి" అన్నారు. భక్తులందరూ చూస్తుండగా స్వామి ముఖంలో కాంతీ, తేజస్సు దృష్టిలో తీవ్రత, బాగా ఎక్కువగా ప్రస్ఫుటమయ్యాయి. స్వామి భక్తులతో తనకు చేయూతనిచ్చి కూరోబెట్టమన్నారు, శ్రీపాద భట్ కూర్చోబెట్టారు. "ఎవరూ దుఃఖించకూడదు, నేను సర్వత్రా వుంటాను. పిలిస్తే పలుకుతాను అంటూ, పద్మాసనం వేసుకుని కూర్చుంటునే శరీరాన్ని విడిచారు స్వామి.తర్వాత స్వామి వారి దేహాన్ని చోళప్ప ఇంటి ముందు సమాధి చేసారు. దీనిని చోళప్ప మఠం అంటారు.

స్వామి నిర్యాణ సమయంలో కేశవనాయక్ అనే భక్తుడు స్వామి నిర్యాణం చెందబోతున్నారని అర్ధమై శోకిస్తుంటే, స్వామి తమ పాదుకలు అతనికిచ్చి - "నా అవతారం శిరిడీలో వున్నారు సేవించుకో అన్నారు." స్వామి చెప్పినట్లే అతను శిరిడీ వెళ్తుండగా రైలులో అతనికి కలిసిన ప్రయాణికులు సాయి ముస్లీమనీ, కేవలం పిచ్చి ఫకీరని చెప్పారు. అందరూ కలసి శిరిడీ చేరాక నాయక్తో కలిసి వారూ సాయి దర్శనానికి వచ్చారు. నాయక్తో సాయి, "నువ్వూ, నీ కుమారుడు రావచ్చు, తక్కిన వారొస్తే భ్రష్టులవుతారు!" అన్నారు. తర్వాత వేపచెట్టు నుండి కొన్ని ఆకులు తుంచి అందరికీ పంచి, రుచి చూడమన్నారు. అవి నాయక్కీ, అతని కొడుకుకీ తియ్యగానూ, మిగిలినవారికి చేదుగాను అనిపించాయి.
** సద్గురు భక్తులకు సంసారం మధురంగానూ, విద్యాహంకారులకు చేదుగానూ ఉంటుంది.

గురుస్థానమందున్న పాదుకలు :
-------------------------------------
భాయికృష్ణజీ అలీబాగ్‌కర్ అక్కల్‌కోట మహారాజుగారి నిర్యాణాంతరం ఆయన భక్తుడయ్యాడు, ఇతను స్వామి వారి చిత్రపటాన్ని నిత్యం పూజించేవాడు. ఒకనాడతడు అక్కల్కోట వెళ్లి స్వామివారి పాదుకలను పూజించుకోవాలి అనుకున్నాడు. అయితే అతను అక్కల్కోటకి ప్రయాణం అవకముందే స్వామి సమర్ధుల వారు అతనికి స్వప్నంలో దర్శనిమిచ్చి "ప్రస్తుతం నా నివాసస్థలం శిరిడీ, అక్కడికి వచ్చి నీవు నన్ను సేవించుకోవచ్చు" అన్నారు. వెంటనే అతను తన మిత్రుడైన కాంపౌండరు, అతని యజమాని డా.రామారావులతో కలసి శిరిడీ చేరి, అక్కడున్న సాయిబాబా గార్ని స్వామి సమర్ధులు అనే భావంతో పూజించి, అక్కడే ఆరు మాసాలు ఆనందంగా గడిపాడు. అక్కడ వీరికి సగుణ మేరునాయక్కీ,జి.కె దీక్షిత్కీ సన్నిహితులయ్యారు. వారిలో వారు బాబా గారి లీలలు చర్చించుకుంటున్నప్పుడు బాబాగారు వేపచెట్టు కింద తపస్సు చేసిన విషయం ప్రస్తావనకి వచ్చింది. వారి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఈ ఘట్టం ప్రాధాన్యతని గుర్తించిన వీరు బాబాగారి పాదుకల్ని అక్కడ ప్రతిష్ఠాంచాలని నిశ్చయించుకున్నారు. పాదుకల నమూనా తీసుకుని డా.రామారావు కొఠారేగారి సహకారంతో ఉపాసనీ బాబా గారు చెప్పిన మార్పులను బట్టి పాదుకలు చేయించి వేపచెట్టు క్రింద 1912లో శ్రావణ మాసంలో ప్రతిష్ఠించారు.
 

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML